పెరగనున్న సహకార సంఘాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు ఆరునెలల్లోగా మరికొన్ని సంస్కరణలు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) పరిధిలో మరికొన్ని సహకార సంఘాలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 142 సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి తోడుగా మరో 8 సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంగా కొత్త సొసైటీని, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంగా మరో కొత్త సొసైటీని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించారు. కాగా, ఐలాపూర్ సొసైటీ పరిధిలో నందిపేట ఉంది.
మాక్లూర్ మండలంలో మరో రెండు సహకార సంఘాలు, మోపాల్ మండలంలో మరో సహకార సంఘంతోపాటు ఉమ్మడి జిల్లాలో మరో మూడు సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, మానాల సొసైటీ గతంలోనే కరీంనగర్ డీసీసీబీ పరిధిలోకి వెళ్లడం గమనార్హం. ఇక ఉమ్మడి జిల్లాలోని 63 సహకార బ్యాంకుల శాఖలు ఉన్నాయి.
నామినేటెడ్ విధానంలో సహకార పదవులు?
డీసీసీబీ, సహకార సంఘాల పాలకవర్గాల పదవులను సైతం మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవుల మాదిరిగా నామినేటెడ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులకు పదవుల పంపకంలో కలిసివస్తుందని కీలక నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా డీసీసీబీలను కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తారని పలువురు భావిస్తున్నప్పటికీ ఆర్‌బీఐ మాత్రం ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగనున్నాయి. బ్యాంకు టర్నోవర్ విషయంలో తక్కువగా ఉండొద్దనే నిబంధన మేరకు ఆర్‌బీఐ ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది.
టర్నోవర్ పెంచాం..
22 నెలలపాటు డీసీసీబీ చైర్మన్‌గా సేవలు అందించాను. ఈ కాలంలో రూ.1,400 కో ట్ల టర్నోవర్ పెంచాం. బా ధ్యతలు తీసుకునే సమయంలో రూ.1,300 కోట్లు ఉన్న టర్నోవర్‌ను రూ.2,700 కోట్లకు పెంచాం. డిపాజిట్లు భారీగా పెరగడంతోపాటు రుణాలు సైతం ఎక్కువగా ఇచ్చాం. 2023–24లో ఎన్‌పీఏ 15 శా తం ఉండగా, ప్రస్తుతం దాన్ని 5 శాతానికి తగ్గించాం. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఎన్‌పీఏ 10 శా తం లోపు మాత్రమే ఉండాలి. 2023–24లో రూ.2 కోట్ల నష్టం ఉండగా, దీన్ని అధిగమించి 2024– 25లో రూ.21 కోట్ల లాభం సాధించాం. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.20 కోట్ల లాభాలు సాధించాం. ఇది మంచి అచీవ్‌మెంట్‌గా నిలిచింది. – కుంట రమేశ్‌రెడ్డి, డీసీసీబీ తాజా మాజీ చైర్మన్
పెరగనున్న సహకార సంఘాలు


