పదో తరగతి సాంఘికశాస్త్రంలో ‘ఎన్నికల ప్రక్రియ’

పదో తరగతి సాంఘికశాస్త్రం పుస్తకంలో పొందుపర్చిన ఎన్నికల పాఠ్యాంశం - Sakshi

నాగిరెడ్డిపేట: వంద శాతం పోలింగ్‌కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారితో ఓటు వేయిస్తారు. పదో తరగతి విద్యార్థులకు సాంఘికశాస్త్రంలో ‘భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠం ముద్రితమైంది. దీంతో విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎన్నికల సమయంలోనే ఈ పాఠ్యాంశం సిలబస్‌లో ఉండడం విశేషం. ఇందులో ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటుహక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభతరంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశంలో రూపొందించారు. ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిందని, ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ అని వివరించారు. 1952లో నిర్వహించిన తొలి సార్వత్రికల ఎన్నికల్లో 17.32 కోట్లమంది ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం 67కోట్లు దాటిందని, ఎన్నికల నిర్వహణకు సివిల్‌ సర్వీస్‌లకు చెందినవారు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని పాఠ్యాంశంలో పేర్కొన్నారు. దీంతోపాటు దేశంలో భారీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికలసంఘం సుమారు 45లక్షల మంది సిబ్బందితో నిర్వహిస్తోందని విద్యార్థులకు ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు.

ఎన్నికల కమిషన్‌ విధులు..
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఎన్నికల సంఘం విధులు.. గతంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేసిన టీఎన్‌ శేషన్‌ ప్రజల అభిమానాన్ని చూరగొన్న తీరును వివరించారు. రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను వివరించారు. ఓటర్ల జాబితాను రూపొందించడం మొదలు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్‌తేదీల ఖరారు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియామవళిని పొందుపర్చారు.

రాజకీయ పార్టీల గుర్తింపు..
రాజకీయ పార్టీ ఏవిధంగా గుర్తింపు పొందుతుంది.. ఇందుకోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలను వివరించారు. ఎన్నికల సంఘం గుర్తులను ఎలా కేటాయిస్తుంది. ఓట్లశాతం ఆధారంగా ఒక పార్టీని జాతీయ, ప్రాంతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారో వివరించారు. పార్టీల ప్రచార సమయం, నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను పాఠ్యాంశంలో పొందుపర్చారు. అభ్యర్థుల ప్రవర్తనా నియమావళికి సంబంధించి 11అంశాలను ఇందులో వివరించారు.

పోలింగ్‌ రోజున..
ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌రోజున అధికారులు, ఏజెంట్ల విధులను వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. రాజకీయపార్టీలు, ఓటర్లు ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి సహకరించడం, పోలింగ్‌రోజు ఏ అధికారి ఏ విధులు నిర్వర్తిస్తారో తెలియజేశారు.

టీఎన్‌ శేషన్‌ సిఫార్సులు
భారత ఎన్నికల కమిషనర్‌గా 1990 నుంచి 1996 వరకు పనిచేసిన టీఎన్‌ శేషన్‌ ఎన్నికల నిర్వహణలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. వాటిని ఈ పాఠ్యాంశంలో పొందుపర్చారు.

ఎన్నికల ప్రచార సమయాన్ని నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుంచి 14 రోజలుగా నిర్ణయించారు.

ఒక అభ్యర్థి ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయరాదు.

ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే ఆరేళ్లపాటు పోటీకి అనర్హులు.

పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి కానీ రద్దు చేయరాదు.

ప్రచారం పూర్తయిన తర్వాత 48గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top