
టీకా కోసం వెళ్తూ అనంతలోకాలకు..
భిక్కనూరు : టీకా వేయించేందుకు మూడు నెలల పసికందుతోపాటు వెళ్లిన ముగ్గురిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. భిక్కనూరు మండలం జంగంపల్లి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామానికి చెందిన మెరుగు కిషన్ (54) అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా రణదీవ్‌నగర్ చర్చిలో పాఽస్టర్‌గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను ఒక నెల కిషన్, మరో నెల తన సోదరుడు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు కిషన్ కామారెడ్డికి వచ్చి శాబ్దీపూర్ శివారులో ఉన్న అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. కిషన్ కుమార్తె జాస్లీన్ (30)కు ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన పాస్టర్ ఆగమని ప్రకాశ్‌తో వివాహం చేశాడు. జాస్లీన్‌కు జోయల్ ప్రకాశ్(4), మూడు నెలల జాడ్సన్ అనే పసికందు ఉంది. జాస్లీన్ ఇటీవల తన కుమారులతో కామారెడ్డికి వచ్చి తండ్రి, నానమ్మ–తాతయ్యలతో కలిసి ఉంటోంది. జాడ్సన్ నెల టీకాకు సమయం అయ్యింది. కాగా, భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో ఆశవర్కరుగా పనిచేసే బంధువును కలిసి జాడ్సన్‌కు ఇప్పించవచ్చని భావించిన జాస్లీన్ ఈ విషయాన్ని తండ్రి కిషన్‌కు వివరించింది. దీంతో కిషన్ తన ఎలక్ట్రిక్ స్కూటీపై జాస్లీన్, మనుమలు జోయల్ ప్రకాశ్, జాడ్సన్‌లను తీసుకొని భిక్కనూరుకు బయల్దేరాడు. జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూటులో టిప్పర్ వేగంగా వచ్చి ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో నలుగురు గాలిలో ఎగిరి కిందపడ్డారు. కిషన్, జాస్లీన్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్‌లను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ, కామారెడ్డి ఇన్‌చార్జి శ్రీనివాస్ రావు, రూరల్ సీఐ రామన్ పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా టిప్పర్‌ను రాంగ్‌రూట్‌లో నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని నలుగురు మృతికి కారణమైన డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశామని ఎస్సై ఆంజనేయులు వివరించారు.
టిప్పర్ రూపంలో ఎదురుగా
వచ్చిన మృత్యువు
తాత, ఇద్దరు మనుమలు,
కుమార్తె మృతి
జంగంపల్లిలో నెత్తురోడిన
జాతీయ రహదారి

టీకా కోసం వెళ్తూ అనంతలోకాలకు..