
పీసీసీ చీఫ్‌ది అవగాహనరాహిత్యం
సుభాష్‌నగర్: రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌వోబీ)లకు కేంద్రం నిధులు ఆగడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అనడం అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. జిల్లాలోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్‌వోబీలకు దీపావళి తర్వాత మూడు, నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేయాలని, లేకపోతే నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహేష్‌కుమార్‌గౌడ్‌కు అవగాహన లేక కేంద్రంపై నెట్టేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. సబ్జెక్ట్ తెలుసుకుని మీడియా ముందు మాట్లాడాలని హితవుపలికారు. మాధవనగర్ ఆర్‌వోబీలో సగం నిధులు తప్ప మిగతా అన్ని ఆర్‌వోబీలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నామన్నారు. ఆయా ఆర్‌వోబీలకు సంబంధించి 75శాతానికి పైగా నిధులు రాష్ట్ర ఖజానాలో కేంద్రం జమ చేసిందని అర్వింద్ తెలిపారు. పథకాలు, అభివృద్ధి పనులు, వరద నష్టం, ఇతర బిల్లులకు నిధులు విడుదల చేయాలని కోరితే డబ్బులు లేవని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాకేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయానికి రెండెకరాల స్థలం కేటాయించాలని ఎంపీ డిమాండ్‌చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై బురదజల్లే కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీలో బీసీ ధర్నా చేసినప్పుడు రాహుల్‌గాంధీ ఎందుకు రాలేదన్నారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదం తెలపాలని, అందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతి పార్టీలని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, వాళ్ల హయాంలోనే ఆ ఓట్లు నమోదయ్యాయేమోనని అర్వింద్ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లోనే అధికంగా క్లబ్‌లు ఉంటాయని, బీఆర్‌ఎస్ పాలనలో క్లబ్‌లకు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నల్లో జరిగిందని ప్రశ్నించారు. ఆ బీఆర్‌ఎస్ కీలక నాయకుడెవరు.. కేసులు నమోదైతే నిర్వీర్యం చేసిందెవరో అందరికీ తెలుసన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో దేశభద్రతకే ముప్పు అని విమర్శించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రదీప్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్‌వోబీ నిధులు విడుదల
చేయకపోతే నిరాహార దీక్ష
బీసీ రిజర్వేషన్లపై బీజేపీపై
బురదజల్లే కుట్ర
మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురి