
ధాన్యం సేకరణ ప్రారంభించాలి
బోధన్: ధాన్యం సేకరణను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్‌చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎడపల్లిలోని బోధన్ – నిజామాబాద్ రహదారిపై రైతులు బుధవారం బైఠాయించారు. రాస్తారోకో కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై ముత్యాల రమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఎస్సై సముదాయించడంతో వారు ఆందోళనలను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సొసైటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరించడం లేదని, తాము పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.