కుంగిన నేషనల్‌ హైవే.. నిజామాబాద్‌-హైదరాబాద్‌ రూట్‌ బంద్‌ | Severe Damage To Nizamabad-Hyderabad NH44 Road Blocked Details | Sakshi
Sakshi News home page

కుంగిన నేషనల్‌ హైవే.. నిజామాబాద్‌-హైదరాబాద్‌ రూట్‌ బంద్‌

Aug 29 2025 10:25 AM | Updated on Aug 29 2025 10:50 AM

Severe Damage To Nizamabad-Hyderabad NH44 Road Blocked Details

హైదరాబాద్‌, సాక్షి: రెండు రోజులపాటు వరుణుడు సృష్టించిన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్‌ ఆగమైంది. అడుగుల లోతుల్లో వరద నీరు రావడంతో రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద నేషనల్‌ హైవే 44 కుంగిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రోడ్డు శుక్రవారం ఉదయం బ్లాక్‌ అయ్యింది. సదాశివనగర్‌ నుంచి పొందుర్తి వరకు.. 20 కిలోమీటర్ల మేర  రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నేషనల్ హైవే 44 (NH 44) భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి. శ్రీనగర్ (జమ్మూ & కాశ్మీర్) నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు దాదాపు 4,113 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఉత్తర-దక్షిణ భారత దేశాన్ని కలిపే ప్రధానమైన మార్గం.. అందునా వాణిజ్య రవాణాకు కీలక మార్గం కావడం గమనార్హం. 

అయితే అధికారులు ఇప్పటికే తాత్కాలిక మరమ్మత్తులను ప్రారంభించినా.. చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. భారీ సంఖ్యలో అది భారీ వాహనాలు ఈ రహదారిలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ రూట్‌లో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్లు.. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచన చేస్తున్నారు. 

రాష్ట్రంలో భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు అతలాకుతులమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్​ జిల్లాల్లో భారీగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్​, నిర్మల్​, కుమురం భీం, యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లోనూ రహదారులు పాడయ్యాయి.

కామారెడ్డి జిల్లాలో 20, మెదక్​ జిల్లాలో 18 ప్రాంతాల్లో భారీగా రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి డివిజన్​లో 53 ప్రాంతాల్లో 65 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 27 వంతెనలు, కల్వర్టులు పాడయ్యాయి. మెదక్‌​లో 33 ప్రాంతాల్లో 53 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. మరో 12 చోట్ల వంతెనలు, కల్వర్టులు పాడయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్‌లో 45 ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ డివిజన్‌లో 63 ప్రాంతాల్లో, ఆదిలాబాద్‌లో 46 ప్రాంతాల్లో రోడ్లు పాడయ్యాయి.

తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి 794 ప్రాంతాల్లో మొత్తం 1,039 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 305 ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 206 కల్వర్టులు, కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. 31 ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయి. ఈ రహదారి పనులు పూర్తి చేయడం కోసం రూ.1,157.46 కోట్లు అవసరమని ఆర్ ​అండ్ ​బీ వర్గాలు తెలిపాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.53.76 కోట్లు అవసరమని పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement