గెలుపు వెనుక అలుపెరుగని శ్రమ! | - | Sakshi
Sakshi News home page

గెలుపు వెనుక అలుపెరుగని శ్రమ!

Nov 26 2026 11:50 PM | Updated on Nov 26 2026 11:50 PM

● పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న డీఎస్పీలు ● శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన నలుగురు ట్రైనీలు

పెద్ద లక్ష్యాన్ని చేరుకున్నా..

నిర్మల్‌టౌన్‌: కృషి, పట్టుదల, లక్ష్యంపై స్పష్టమైన సంకల్పం ఉంటే ఎంతటి గమ్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అపజయాలను అధిగమిస్తూ అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించారు. దీక్షతో చదువులో రాణించి చివరకు తమ కలను సాకారం చేసుకున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షలో విజయం సాధించి డీఎస్పీలుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శిక్షణలో భాగంగా నలుగురు ట్రైనీ డీఎస్పీలు జిల్లాకు చేరుకున్నారు. వీరు నవంబర్‌ 23 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు జిల్లాలో ట్రైనీ డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను, లక్ష్య సాధన కోసం పడిన శ్రమను ‘సాక్షి’తో పంచుకున్నారు.

మాది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. నాన్న వెంకటాద్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. నేను ఉన్నత స్థానానికి చేరుకోవాలని, నా భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకునేవారు. అందుకోసం నాకు మంచి విద్యను అందించి ఎంతగానో ప్రోత్సహించారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశాను. అప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత మరింత పట్టుదలతో చదివి 257వ ర్యాంకు సాధించాను. డీఎస్పీగా ఎంపిక కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు అంకితం. నాకు మొదటి నుంచి సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష ఉంది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ ఉద్యోగం ద్వారా లభించడం ఆనందంగా ఉంది.

– పి.సందీప్‌ కుమార్‌, ట్రైనీ డీఎస్పీ

మాది హైదరాబాద్‌. మా నాన్న గతంలో ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేసేవారు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. అమ్మ గృహిణి. చిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాను. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ పూర్తి చేశాను. చదువు పూర్తయినప్పటి నుంచి గ్రూప్స్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ఎంతో కష్టపడ్డాను. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాను. చివరకు గ్రూప్‌–1లో 359వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాను. ఈ విజయం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ ఈ ఉద్యోగానికి పూర్తి న్యాయం చేస్తాను.

– గజారే సంగీత, ట్రైనీ డీఎస్పీ

నాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మా నాన్న సీతారాములు వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ జ్యోతి హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తుంది. నన్ను ఉన్నత స్థానంలో చూడాలన్నది వారి కల. వారి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. క్రిమినల్‌ ‘లా‘ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. అనంతరం గ్రూప్‌–1 లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా చదివాను. ఎన్నో సవాళ్లు ఎదురైనా పట్టుదల వీడకుండా సాధన కొనసాగించాను. చివరకు గ్రూప్‌–1లో 379వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాను. ఈ విజయం ఎంతో ఆనందాన్నిచ్చింది. నన్ను ఉన్నత స్థానంలో చూడాలనుకున్న నా తల్లిదండ్రుల కల నెరవేర్చినందుకు గర్వంగా ఉంది.

– డి.చందన, ట్రైనీ డీఎస్పీ

మాది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం వాహిలా సింగారంలోని వ్యవసాయ కూలీ కుటుంబం. అమ్మానాన్న అచ్చయ్య–సీత వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ.. నేను చదువుకోవాలని ఎంతో ప్రోత్సాహం అందించారు. వారి కష్టం వృథా చేయకూడదనే సంకల్పంతో పట్టుదలగా చదివాను. బాసర ట్రిపుల్‌ ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. అనంతరం ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌)గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే గ్రూప్‌–1కు సిద్ధమయ్యాను. నిరంతర కృషి, పట్టుదలతో గ్రూప్‌–1లో 393వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాను. ఈ విజయం నా జీవితంలో ఎంతో సంతోషాన్నిచ్చింది. ముఖ్యంగా నా తల్లిదండ్రులు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. వారి ప్రోత్సాహం, ఆశీస్సులే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. లక్ష్యంపై నమ్మకం, కష్టపడే తత్వం ఉంటే అనుకున్నది సాధించవచ్చు. – చట్టు భవాని, ట్రైనీ డీఎస్పీ

మాది వ్యవసాయ కుటుంబం..

తల్లిదండ్రుల కల నిజం చేశా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement