నిర్మల్ రూరల్: రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ, జనాభా విద్యా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జానపద బృంద నృత్య పోటీల్లో జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. 9వ తరగతికి చెందిన శ్రేయ, మధుప్రియ, అక్షయ, రుచిత, నాగజ్యోతి, తేజస్విని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది పోటీల్లో రాష్ట్రంలో ఫస్ట్ ప్రైజ్ సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జనవరిలో ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ విద్యార్థినులు పాల్గొంటారు. డీఈవో భోజన్న, కళాశాల ప్రిన్సిపాల్ డేనియల్, జిల్లా కోఆర్డినేటర్ నరసయ్య విద్యార్థినులు, గైడ్ టీచర్ సునీతను అభినందించారు.


