తల్లిదండ్రులపై ఆధారపడొద్దని విద్యార్థుల ప్రమాదకర నిర్ణయాలు ట్రేడింగ్ యాప్స్‌తో ఆర్థిక ఇబ్బందులు సంపత్ హెచ్చరికతో అయినా మార్పు రావాలి..
భైంసా: చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు ఆన్‌లైన్ పెట్టుబడి యాప్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నా రు. ఉన్నత విద్య అభ్యసించి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాల్సిన యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ప్ర మాదకరమైన యాప్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం వేయకూడదని, వ్యక్తిగత అవసరాలకు సొంతంగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తాలతో ప్రారంభించి, పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులే బాధితులు..
బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయానికి పంపిస్తున్నారు. అలాంటి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఆన్‌లైన్ ఆదాయ మార్గాలవైపు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ప్రచారాలు, స్నేహితుల ప్రభావం కూడా కొందరిని ఈ యాప్స్‌వైపు ఆకర్షిస్తున్నాయి. లాభాలు వచ్చినప్పుడు మరింత పెట్టుబడి పెట్టడం, నష్టాలు సంభవించినప్పుడు వాటిని తిరిగి సాధించాలనే ప్రయత్నంలో మరింత చిక్కుల్లో పడుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
సంపత్ ఘటనతోనైనా కళ్లు తెరవాలి
ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సంపత్ ఆన్‌లైన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విద్యార్థి లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రుల ఆశలు, భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉన్న విద్యార్థి జీవితం అర్ధంతరంగా ముగియడం కలచివేస్తోంది. ఒక్క సంపత్ ఘటనతోనే ఈ సమస్య ముగిసిపోదు. సంపత్ కూడా తన సూసైడ్ నోట్‌లో ఎవరూ యాప్స్‌వైపు వెళ్లొద్దని హెచ్చరించడం విద్యార్థులంతా ఆలోచించాల్సిన అంశం. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో ఇంకా ఎంతమంది ఇలాంటి యాప్స్ ప్రభావానికి లోనవుతున్నారు? ఎంతమంది ఆర్థిక ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు? అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.చదువుకోవడానికి వచ్చిన పిల్లలు సంపాదన మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి రాకూడదు. తల్లిదండ్రుల కలలు, విద్యార్థుల భవిష్యత్తు ఆన్‌లైన్ యాప్స్ ఉచ్చులో చిక్కుకోకూడదు. బెట్టింగ్, ప్రమాదకర పెట్టుబడి యాప్స్‌పై నియంత్రణతోపాటు విద్యార్థులకు ఆర్థిక, మానసిక భరోసా కల్పించాల్సిన బాధ్యత క్యాంపస్ యాజమాన్యంపై ఉంది.


