నిర్మల్‌టౌన్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించి చట్టపరంగా పరిష్కారం చూపాలని ఎస్పీ జానకీషర్మిల అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారంలో జాప్యం లేకుండా, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.


