● ఆవిరవుతున్న రైతుల ఆశలు
భైంసా: వానాకాలం పంటల సాగు చేపట్టిన రైతులు ఈ ఏడాది ఎల్‌నినోకు ఎదురొడ్డుతున్నారు. ఇప్పటికే వర్షాలు తక్కువగా కురిశాయి. చెరువులు, కుంటలు నీరు లేక వెలవెల బోతున్నాయి. మరోవైపు ఎండలు మండుతున్నాయి. దీంతో చివరి దశలో ఉన్న పంటలు నీరందక ఎండిపోతున్నాయి.
4.26 లక్షల ఎకరాల్లో సాగు
ఈ సీజన్‌లో వరి 1.36 లక్షలు, పత్తి 1.63 లక్షలు, సోయాబీన్ 1.08 లక్షలు, మొక్కజొన్న 14 వేలు, పసుపు 5 వేల ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తం 4.26 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అయితే సీజన్ చివర్లో వర్షాభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు అడుగంటగా, అప్రకటిత విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి.
23 శాతం లోటు
జూన్ 1 నుంచి అక్టోబరు 11 వరకు సాధారణం 945.4 మి.మీల వర్షం కురవాలి. కానీ 730.1 మి.మీలు మాత్రమే కురిసింది. 23 శాతం లోటు నమోదైంది. కుభీర్ మండలంలో 48 శాతం, తానూరులో 41 శాతం, కుంటాల, నర్సాపూర్ (జి)లో 34 శాతం, బాసరలో 35 శాతం, సారంగాపూర్‌లో 31 శాతం, భైంసా, ముధోల్, నిర్మల్ గ్రామీణంలో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణ పరిధిలో ఉన్నా జిల్లా సగటు లోటులోనే ఉంది.
అప్పుల భారం..
పంటల సాగు కోసం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం భారీగా పెట్టుబడి పెట్టారు. వర్షాభావంతో పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేసి సహాయం అందించాలని కోరుతున్నారు.
జిల్లాలో 23 శాతం లోటు వర్షపాతం
చివరి దశలో నీరు లేక వరి పైర్లు ఎండిపోతున్నాయి. పత్తి మొక్కల ఆకులు ఎర్రబారి ఎదుగుదల కోల్పోతున్నాయి. మొక్కజొన్న, పసుపుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. 1.08 లక్షల ఎకరాల్లో సాగైన సోయాబీన్ కోతలు పూర్తయ్యాయి. సాధారణం 10–12 క్వింటాళ్లకు బదులు ఎకరానికి 5–6 క్వింటాళ్లే వచ్చింది. కీలక దశలో వర్షాలు లేక దిగుబడి తగ్గింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆదాయం రాకుండా పోయింది.


