సోయా ధరకు ‘సర్వర్‌’ సమస్య..! | - | Sakshi
Sakshi News home page

సోయా ధరకు ‘సర్వర్‌’ సమస్య..!

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

● ఈనామ్‌ పనిచేయక ఓపెన్‌ ఆక్షన్‌ ● ధర తగ్గిస్తున్నారని రైతుల ఆందోళన

భైంసాటౌన్‌: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో సోయా దిగుబడి సగం తగ్గింది. అయితే మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు సోయా విక్రయానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రతీరోజు భైంసాలోని వ్యవసాయ మార్కెట్‌కు 300 నుంచి 400 వరకు లాట్లు వస్తున్నాయి. ధర సైతం క్వింటాలుకు రూ.6వేలకుపైనే పలుకుతుండడంతో రైతులు భారీగా సోయా మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈనామ్‌ సర్వర్‌ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఓపెన్‌ ఆక్షన్‌ పద్ధతిలో బీట్‌ నిర్వహిస్తున్నారు. గత గురువారం సర్వర్‌ సమస్య తలెత్తగా, ఓపెన్‌ ఆక్షన్‌లోనే కొనుగోళ్లు చేపట్టారు. శుక్రవారం బీట్‌ నిలిపేయగా, శనివారం అమావాస్య, ఆదివారం సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు బీట్‌ నిర్వహించలేదు. సోమవారం తిరిగి మార్కెట్‌ తెరుచుకోగా, 390 లాట్లు విక్రయానికి వచ్చాయి. అయితే, ఈరోజు కూడా ఈనామ్‌ సర్వర్‌ సమస్య అంటూ అధికారులు మళ్లీ ఓపెన్‌ ఆక్షన్‌ పద్ధతిలో బీట్‌ నిర్వహిస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వరకు సోయా క్వింటాలుకు రూ.6,900 వరకు పలికిందని, ఇప్పుడు ఓపెన్‌ ఆక్షన్‌లో వ్యాపారులు రూ.6,500 వరకే చెల్లిస్తున్నారని బీట్‌ను అడ్డుకున్నారు. గాంధీగంజ్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సర్వర్‌ సమస్య సాకుతో వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని, ఈనామ్‌ పద్ధతిలోనే పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల రాస్తారోకోతో దాదాపు గంటపాటు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ఏఎంసీ కార్యదర్శి పూర్యా, పట్టణ సీఐ సాయికుమార్‌ రైతులను సముదాయించినా వారు ఆందోళన విరమించలేదు. ఏఎంసీ చైర్మన్‌ ఆనంద్‌రావు పటేల్‌ రావాలని పట్టుబడ్డారు. కొద్దిసేపటికి ఆయన వచ్చి రైతులతో మాట్లాడారు. సర్వర్‌ సమస్య కారణంగానే ఓపెన్‌ ఆక్షన్‌లో బీట్‌ నిర్వహిస్తున్నామని, ఇతర మార్కెట్లతో పోలిస్తే భైంసా మార్కెట్‌లోనే ధర ఎక్కువగా ఉందని నచ్చజెప్పారు. దీంతోపాటు ఆయన స్వయంగా దగ్గరుంచి బీట్‌ నిర్వహింపజేస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. సోమవారం క్వింటాల్‌కు అధికంగా రూ.6,766 పలికినట్లు ఏఎంసీ అధికారులు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని మార్కెట్‌ ధర ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని ఏఎంసీ చైర్మన్‌ ఆనంద్‌రావు పటేల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement