భూకబ్జాలపై విచారణ కమిటీ | - | Sakshi
Sakshi News home page

భూకబ్జాలపై విచారణ కమిటీ

Oct 6 2026 11:59 PM | Updated on Oct 6 2026 11:59 PM

వారం రోజుల్లో నివేదికలు..

నెలలో 60 శాతం పురోగతి ఉండాలి

కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేతో కలిసి సమీక్ష

ఖానాపూర్‌: ఖానాపూర్‌, కడెం మండలాల్లో అసైన్డ్‌, ఆదివాసీ, ఇరిగేషన్‌ తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ మొరం తవ్వకాలు, వెంచర్లపై ప్రత్యేక కమిటీలతో సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. ఖానాపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్‌, అటవీ, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. హరిత రిసార్ట్‌, మైసంపేట, బెల్లాల సమీపంలోని గోదావరి కుర్రు భూములు, ఖానాపూర్‌ డబుల్‌ బెడ్‌రూం కా లనీ ప్రభుత్వ భూములపై ఆరుగురు సభ్యులతో ప్ర త్యేక కమిటీలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నెల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికి కనీసం 60 శాతం పురోగతి ఉండాలని స్పష్టం చేశారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సర్వే

ఖానాపూర్‌ పట్టణంలోని డబుల్‌ బెడ్‌రూం కాలనీ పరిధిలో ప్రభుత్వ భూముల్లో జరిగిన మొరం తవ్వకాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు కూడా అర్హులను గుర్తించి స్థలాలు కేటాయించాలని కోరారు. పట్టణంలో సుమారు 110 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు 79 ఎకరాలు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ శాఖలకు కేటాయించిన భూముల్లో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి మిగిలిన భూమిని నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం వినియోగించాలని కోరారు.

ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కొరత

ఖానాపూర్‌లో నేటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలు, సబ్‌సెంటర్‌, లైబ్రరీ తదితరాలకు సరైన ప్రభుత్వ స్థలం లేకపోవడాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థలాలను ముందుగానే గుర్తించాలని కోరారు. సబ్‌సెంటర్‌ కోసం వాగు అవతల స్థలం పరిశీలించాల్సి వచ్చిందని, కనీసం లైబ్రరీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వ స్థలం లేకపోవడం పరిస్థితికి నిదర్శనమన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు గతంలో స్థలం చూపకపోవడంతో అవకాశం కోల్పోయామని, భవిష్యత్‌లో ప్రభుత్వ స్థలాలను ముందుగానే గుర్తించి విద్యాసంస్థలకు కేటాయించాలని కోరారు. టీపీఎస్‌ పాఠశాలకు సరిపడా స్థలం లేకపోతే ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ఖానాపూర్‌కు డిగ్రీ కళాశాల అవసరమా, పాలిటెక్నిక్‌ కళాశాల అవసరమా అనే అంశంపై విద్యావంతులు, మేధావులు, అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, అర్హతలను పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు.

అక్రమ వెంచర్లు, భవనాలపై కలెక్టర్‌ ఆగ్రహం

పట్టణంలో భవన నిర్మాణాలు, అనుమతులపై అధికారుల పనితీరును కలెక్టర్‌ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు, వెంచర్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించాలని సూచించారు. సమీక్ష సమావేశానికి ఎఫ్‌డీవో, ఎఫ్‌ఆర్‌వో హాజరుకాకపోవడాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే పేదల దరఖాస్తులపై అధికారులు స్పందించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, ఆర్డీవో దేవదాస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, అటవీ, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హరిత రిసార్ట్‌, కుర్రు భూములు, డబుల్‌ బెడ్‌రూం కాలనీపై సమగ్ర విచారణ

కుర్రు భూములపై ఫిర్యాదు

బెల్లాల గ్రామం సమీపంలోని గోదావరి మధ్య కుర్రులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు గతంలో అసైన్డ్‌ పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం ఆ భూములు ఇతరుల పేర్లకు బదలాయించబడ్డాయని బాధితులు ఎమ్మెల్యే, కలెక్టర్‌కు విన్నవించారు. తమ భూములు ఎలా బదలాయించబడ్డాయో విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. దీనిపై జగిత్యాల కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైన వివరాలు సేకరిస్తామని భవేశ్‌మిశ్రా తెలిపారు. నది మధ్యలోని భూమి ఇరిగేషన్‌ పరిధిలో ఉంటే అది ఇతరుల చేతుల్లోకి ఎలా వెళ్లిందో పరిశీలిస్తామన్నారు.

పేదల భూములతో వ్యాపారమా?

అసైన్డ్‌, ఆదివాసీ, ఇరిగేషన్‌ భూములను ఆక్రమించి సొంత వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ కోరారు. కడెం రిసార్ట్‌, మైసంపేట, బెల్లాల కుర్రు భూములపై పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అర్హులైన పేదలకు అందించాలన్నారు. విద్యుత్‌ బకాయిలున్న వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement