మండీ.. జాగ్రత్తండీ..! | - | Sakshi
Sakshi News home page

మండీ.. జాగ్రత్తండీ..!

Oct 6 2026 11:59 PM | Updated on Oct 6 2026 11:59 PM

● జిల్లాలో తరచూ ఫుడ్‌ పాయిజన్‌ ● తాజాగా భైంసా హోటల్‌లో ఆహారం కల్తీ ● రెండేళ్లక్రితం నిర్మల్‌లో ఒకరు మృతి

‘పప్పా.. ఈరోజు బయటే డిన్నర్‌ చేద్దాం..’ అంటూ పిల్లలు గారాబంగా అడగడమే ఆలస్యం ఇంటిల్లిపాదీ.. ఏదో ఒక హోటల్‌కు వెళ్తున్నారు. ‘అరె మామా.. బర్త్‌డే దావత్‌ లేదా.’ అని దోస్తులు అనగానే.. ‘చలో ఇయ్యాల మండీ తిందాం’ అంటూ దోస్తులందరూ కలిసి వెళ్తున్నారు. అలా వెళ్లి కడుపునిండా భోజనం చేసి.. ఆనందంగా ఇంటికి తిరిగి రావాలి. కానీ.. కొన్ని సందర్భాల్లో ఆస్వాదించిన ఆహారం కలుషితమైతే.. ఆనందం మాట అటుంచి, అనారోగ్యంతో ఆస్పత్రిపాలవ్వాల్సి వస్తోంది. నిర్మల్‌

కలుషిత ఆహారం, నాణ్యతలేని పదార్థాల వినియోగం, స్టోరేజీ చేసిన వంటకాలు, పరిశుభ్రత లోపాలు, నిషేధిత వస్తువుల వాడకం తదితర కారణాలతో జిల్లాలో తరచూ ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

రెండేళ్లక్రితం జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలోని గ్రిల్‌ నైన్‌ అనే రెస్టారెంట్‌లో 2024, నవంబర్‌ 5న భోజనం చేసిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ తిన్న ఆహారం పాయిజన్‌ కావడంతో ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌కు చెందిన పూల్‌కాలీ బైగా(19) అనే యువతి మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ఆ ఘటన కారణంగా ఆ హోటల్‌ను సీజ్‌ చేశారు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రత, ముడి పదార్థాల నిల్వపై ప్రశ్నలు తలెత్తాయి. అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తామని ప్రకటించినా.. కొంతకాలానికే పరిమితమయ్యాయి.

తాజాగా భైంసాలో..

తాజాగా భైంసాలోని ఓ మండీ హోటల్‌లో భోజనం చేసిన పలువురు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొందరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొందరు చేరారు. రెండు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో పాడైన కేక్‌ ఇవ్వడంతో ఓ చిన్నారి ఆస్పత్రి పాలైంది. పట్టణ శివారులోని ఓ దాబాలో చికెన్‌ తిన్న యువకులూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలతో జిల్లాలోని మండీలు, హోటళ్లు, దాబాలలో అందిస్తున్న ఆహారంపై మరోసారి చర్చ మొదలైంది.

పరిశీలిస్తాం..

జిల్లాలో తరచూ హోటళ్లు, ఇతరత్రా రెస్టారెంట్లను తనిఖీ చేస్తున్నాం. ఇటీవల చోటుచేసుకున్న ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు మా దృష్టికి రాలేదు. వివరాలు తెలుసుకుని చర్యలు చేపడతాం.

– సునీత, ఇన్‌చార్జి ఫుడ్‌సేఫ్టీ అధికారి

ప్రజారోగ్యంతో చెలగాటం..

ఆహారం కలుషితమైతే ఒక్క వ్యక్తికే కాకుండా ఒకేసారి పలువురు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది. గతంలో జరిగిన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. గతంతో పోలిస్తే ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు పెరిగినా.. మరింత పర్యవేక్షణ అవసరముంది. నిబంధనలు ఉల్లంఘించే, నిషేధిత మయోనైజ్‌ వంటి ఉపయోగించే దాబాలు, మండీలు, హోటళ్లపై చర్యలు తీసుకోవడంతోపాటు.. ఆహార నాణ్యత పరీక్షలు, పరిశుభ్రత ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement