లక్ష్మణచాంద: ఎల్‌నినోను ఎదురొడ్డి పగలు, రాత్రీ శ్రమించి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర రావడం కూడా గగనంగా మారుతుంది. కానీ ఈసారి పంటల దిగుడి తగ్గడంతో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సోయాకు జిల్లాలో వ్యాపారులు మద్దతు ధరకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మక్కలకు కూడా మస్తు డిమాండ్ ఉంది. దీంతో వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు.
జిల్లాలో 25 వేల ఎకరాల్లో సాగు
ఈ వానాకాలంలో జిల్లాలోని 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయ్యింది. ప్రస్తుతం పంట కోతకు రావడంతో జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో రైతులు కోతలు కోస్తుండగా, మరికొన్ని మండలాల్లో కోసిన అన్నదాతలు మొక్కజొన్నను ఆరబెట్టి విక్రయిస్తున్నారు.
తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతుల పంట చేతికి వచ్చింది. పలు మండలాల్లో పంట కోసిన రైతులు కోసి ఆరబెట్టి విక్రయిస్తున్నా ప్రభుత్వం కొనుగోలు మాత్రం ఎక్కడా ప్రారంభించలేదని రైతులు అంటున్నారు.
మద్దతు ధర కన్నా ఎక్కువే..
ఎల్‌నినో ప్రభావంతో అసలే వర్షాభావ పరిస్థితుల కారణంగా సరైన వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానా అవస్థలు పడి మొక్కజొన్న పంట సాగు చేసిన జిల్లా రైతులకు ఎట్టకేలకు పంట చేతికి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2,410 ఉంది. అయితే ప్రస్తుతం బయట దళారులు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. దళారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.2,500 నుంచి రూ.2,600 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువే ధర ఉందని రైతులు అంటున్నారు.
ఆదేశాలు రాలేదు
అన్నదాతలు సాగు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. మొక్కజొన్న కోతలు మొదలయ్యాయని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఆదేశాలొచ్చాక కేంద్రాలు తెరిచి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. – మహేష్, మార్క్‌ఫెడ్ డీఎం


