ఆడించేవారేరి? | - | Sakshi
Sakshi News home page

ఆడించేవారేరి?

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

తానూరు : ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తామని చెబుతున్నా, అందుకు తగిన చర్యలు మాత్రం కనిపించడం లేదు. విద్యార్థులను క్రీడాంశాల్లో తీర్చిదిద్దాలనే తపన కాగితాలకే పరిమితమవుతోంది. గ్రామీణ ఉన్నత పాఠశాలల్లో పూర్తిస్థాయి వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థుల కలలు నెరవేరడం లేదు. జిల్లాలోని పలు మండలాల ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో మైదానాలు ఉన్నా సాంక్షన్‌ పీఈటీ పోస్టులు లేక విద్యార్థులు క్రీడారంగంలో ముందుకు సాగలేకపోతున్నారు.

45 పాఠశాలల్లో పీఈటీలు లేరు

జిల్లాలో మొత్తం 118 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్న త పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సాంక్షన్‌ పోస్టులకు 73 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సాంక్షన్‌ పోస్టులు లేని 45 హైస్కూ ళ్లలో పీఈటీలు లేక విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపడం లేదు. 54 పీడీ పోస్టులకు 49 మంది పనిచేస్తుండగా ఐదు ఖాళీగా ఉన్నాయి. ఏడు పీఈటీ పోస్టులకు బదులు 11 మంది పనిచేస్తున్నారు. అదనంగా ఉన్న నలుగురిని సర్దుబాటు కింద ఇన్‌చార్జ్‌ పీడీలుగా నియమించారు. ఒక పీడీ పోస్టు ఖాళీగా ఉంది. ఎనిమిదో తరగతి వరకు వందకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఎస్‌ఎస్‌ఏ నుంచి ఎనిమిది మంది కాంట్రాక్ట్‌ పీఈటీలు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 118 పాఠశాలల్లో కేవలం 73 మంది మాత్రమే ఉండటంతో 45 పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య అందడం లేదు.

ఆటలకు దూరం..

వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు. చదువుతోపాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలు అవసరమైనా, శిక్షణ ఇచ్చేవారు లేక ఆసక్తి కూడా తగ్గిపోతోంది. రెండేళ్లుగా గ్రామీణ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ మండల స్థాయిలో సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తోంది. ప్రతిభ చూపినవారు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తున్నారు. అయినా చాలా పాఠశాలల్లో పీఈటీలు లేక శిక్షణ లభించక పోటీలకు దూరంగా ఉంటున్నారు. చదువుతోపాటు ఆటల్లో రాణించాలని అధికారులు, నాయకులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు.

జిల్లాలోని పాఠశాలల వివరాలు ..

మొత్తం జిల్లా పరిషత్‌ ఉన్నత

పాఠశాలలు 118

మొత్తం వ్యాయామ ఉపాధ్యాయులు 73 మంది

పీడీలు పోస్టులు 54

వర్కింగ్‌ పోస్టులు 49 ఖాళీలు : 05

పీఈటీ పోస్టులు 07

వర్కింగ్‌ పోస్టులు 11

ఎస్‌ఎస్‌ఏ పీఈటీలు 08

పీఈటీ ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 45

క్రీడా సామగ్రి, మైదానాల కొరత

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం క్రీడా సామగ్రి అందుబాటులో ఉండాలి. ప్రతీరోజు చివరి పీరియడ్‌లో ఆడేందుకు కేటాయించాలి. అయితే చాలా చోట్ల సామగ్రి అంతంతమాత్రంగానే ఉంది. వ్యాయామ ఉపాధ్యాయులు లేని చోట్ల పూర్తి స్థాయి అవగాహన కలగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలలకు సరైన క్రీడా మైదానం కూడా లేదు. ఉన్న కొద్ది స్థలంలోనే ఆడుకుంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పీఈటీలకు కూడా దుస్తులు పంపిణీ కాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు క్రీడలపై అవగాహన కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement