బాసర: బాసరలోని గోదావరి పుష్కర ఘాట్‌ను రాష్ట్ర ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ శనివారం పరిశీలించారు. పుష్కరాల నేపథ్యంలో ఘాట్‌కు పోటెత్తే భక్తులకు వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఘాట్ పరిసరాలను పరిశీలించి, అత్యవసర చికిత్స కేంద్రాలు, మొబైల్ మెడికల్ క్యాంపుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్య సేవలు, అత్యవసర చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మందులు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం బాల ఆలయంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈవో అంజనాదేవి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.


