ఆర్టీసీ ఎన్నికల్లో డబుల్‌ ధమాకా..! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికల్లో డబుల్‌ ధమాకా..!

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● ఒకే కార్మికుడు.. రెండు ఓట్లు ● రెండు బ్యాలెట్‌ పేపర్లు ● రహస్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణ

మంచిర్యాలఅర్బన్‌: ఇతరత్రా పరిశ్రమలు, సంస్థల్లో కార్మిక, ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో వేర్వేరు పద్ధతులు అమల్లో ఉన్నాయి. ఒకేసారి రెండు వేర్వేరు ఓట్లు వేసే విధానం నుంచి ఒకే ఓటుతో రెండు ప్రాతినిధ్యాలను నిర్ణయించే రహస్య బ్యాలెట్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్నింట్లో సింగిల్‌ బ్యాలెట్‌ విధానం అమలు చేస్తుండగా ఆర్టీసీలో డబుల్‌ బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒకే బ్యాలెట్‌ పేపర్‌పై ఓటింగ్‌ జరిపి అత్యధిక శాతం, మెజార్టీ ఓట్లు సాధించిన కార్మిక సంఘాలను ప్రాతినిధ్య గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణి, విద్యుత్‌, తదితర సంస్థల్లో ఒకే బ్యాలెట్‌ ద్వారా రెండు ఫలితాలు గుర్తింపు, ప్రాతినిధ్య హోదాలను నిర్ణయిస్తుండగా ఆర్టీసీలో మాత్రం రాష్ట్రస్థాయి గుర్తింపునకు ఒక ఓటు, రీజియన్‌కు మరో ఓటు విధానం అమలవుతోంది. పరిశ్రమల స్థాయి ఆధారంగా ఎన్నికల పద్ధతులు మారినప్పటికీ స్థానిక సమస్యలకు రాష్ట్రస్థాయి విధానపరమైన నిర్ణయాలకు వేర్వేరు ప్రాతినిధ్యం ఎన్నుకునే డబుల్‌ ఓటు స్వేచ్ఛను ఇవ్వడంలో టీఎస్‌ఆర్టీసీ అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.

సీక్రెట్‌ బ్యాలెట్‌ ఎన్నికలు..

టీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు ఓట్ల విధానం ద్వారా రాష్ట్ర, రీజియన్‌ స్థాయి ప్రాతినిధ్యాలను ఎనన్నుకుంటారు. ఓటింగ్‌ కోసం ప్రతీ డిపోలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, భైంసా, ఆసిఫాబాద్‌లో ప్రత్యేక పొలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ కార్మికుడికి రెండు వేర్వేరు రంగులున్న బ్యాలెట్‌ పేపర్లు ఇస్తారు. మొదటి ఓటు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించే గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునేందుకు, రెండో ఓటు రీజియన్‌ స్థాయిలో పనిచేసే ప్రాతినిధ్యం, రీజియన్‌ యూనియన్‌ను ఎన్నుకునేందుకు ఉపయోగపడుతుంది. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల ఓట్లను కలిపి లెక్కిస్తారు. ఏ యూనియన్‌కు అత్యధిక ఓట్లు వస్తే అది రీజియన్‌ ప్రాతినిధ్య సంఘంగా ప్రకటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్ల డిపోల ఓట్లను లెక్కించి మెజార్టీ సాధించిన యూనియన్‌ రాష్ట్ర గుర్తింపు సంఘంగా నిలుస్తుంది.

రెండు ఓట్లూ కీలకమే..

ఒక కార్మికుడు రాష్ట్రస్థాయిలో పెద్ద సంఘానికి ఓటు వేస్తూనే తమ రీజియన్‌ సమస్యలను పట్టించుకునే మరో యూనియన్‌కు రీజియన్‌ స్థాయిలో ఓటువేసే వెసులుబాటు లభిస్తుంది. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం ప్రభుత్వం, యాజమాన్యంతో మాట్లాడి వేతనం ఒప్పందాలు, బదిలీల వంటి సమస్యలు పరిష్కరించే వీలుంటుంది. రీజియన్‌ పరిధిలోని డిపో సమస్యలు, స్థానిక డ్యూటీల కేటాయింపు, పనివేళలు, స్థానిక యాజమాన్యంతో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి రీజియన్‌స్థాయి ప్రతినిధికి అధికారం ఉంటుంది. ఆదిలాబాద్‌ రీజియన్‌లో 1,773 మంది కార్మికులకు డబుల్‌ ఓట్లు వేసే అవకాశం లభిస్తుంది.స సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 9న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 17న ఫలితాలు ప్రకటించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే దిశగా అడుగులు పడుతుండటంతో యాజమాన్యంతో చర్చించేందుకు ఈసారి గెలిచే గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం చాలా కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement