నిర్మల్‌టౌన్: ఖాకీ యూనిఫాం ధరించి ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నిరుద్యోగ యువత కఠోర శ్రమకు సిద్ధమైంది. కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే ప్రచారంతో జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మైదానాల్లో శరీర దారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌లతోపాటు అగ్నిమాపక, జైలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని యువతలో ఉత్సాహం నెలకొంది. జిల్లా కేంద్రంలోని వివిధ పోలీస్ కోచింగ్ అకాడమీలు, స్టడీ సెంటర్లు అభ్యర్థులతో సందడిగా మారాయి.
అకాడమీల్లో సందడి
పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలోని పోలీస్ శిక్షణ అకాడమీల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో యువత శిక్షణ అకాడమీలకు చేరుకుంటున్నారు. రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఈవెంట్లలో ప్ర తిభ చూపేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు.
ఉద్యోగమే లక్ష్యంగా
పోలీస్ కొలువు సాధించాలన్న పట్టుదలతో అభ్యర్థులు కఠోరంగా శ్రమించడం మొదలుపెట్టారు. వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులను పక్కనపెట్టి ఉద్యోగ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతు కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్నారు. పోలీస్ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవడంతోపాటు తల్లిదండ్రుల కల నెరవేర్చాలన్న సంకల్పంతో శిక్షణలో నిమగ్నమవుతున్నారు.
పోటీ అధికం..
పోలీస్ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండటంతో ఒక్కో మార్కు కూడా కీలకమేనన్న భావన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించడంతోపాటు రాత పరీక్షలో మెరుగైన మార్కులు సాధించేందుకు అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ రోజువారీగా టార్గెట్లు పెట్టుకుని చదువుతున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపైనే దృష్టి సారిస్తున్నామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు.
మైదానాల్లో కసరత్తు..
రాత పరీక్షపై ప్రత్యేక దృష్టి
ఫిజికల్ ట్రైనింగ్‌తోపాటు రాత పరీక్షకు కూడా అభ్యర్థులు సమయం కేటాయిస్తున్నారు. ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గణితం, అరిథ్మెటిక్, రీజనింగ్, తెలంగాణ చరిత్ర, భారత రాజ్యాంగం, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో ప్రతిరోజూ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగుపడేలా అధ్యాపకులు సూచనలు చేస్తున్నారు.
జిల్లాలో ఖాళీలు ఇవీ..
జిల్లా స్థాయిలో పోలీస్ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 105, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 40, ఫైర్ శాఖలో 11 ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 156 పోస్టులు ఉన్నాయి. బాసర జోన్ పరిధిలో 39 ఎస్సై పోస్టులు ఉన్నాయి.
జిల్లా వివరాలు..
పోలీస్ కోచింగ్ సెంటర్లు 10
శిక్షణ పొందుతున్న అభ్యర్థులు 2,300
పురుషులు 1560
మహిళలు 740
పోలీస్ ఉద్యోగాలకు ఫిజికల్ ఈవెంట్లు కీలకం కావడంతో అభ్యర్థులు తెల్లవారుజామునే మైదానాలకు చేరుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ తదితర ఈవెంట్లలో శిక్షణ పొందుతున్నారు. అనుభవజ్ఞులైన ఫిజికల్ ట్రైనర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు తమ శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కఠినంగా సాధన చేస్తున్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, శారీరక దారుఢ్యం పెంచుకోవడం వారి దినచర్యగా మారింది.


