నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో కార్మికులకు తమ హక్కుల గురించి తగిన అవగాహన లేకపోవడంతో లేబర్ కార్డులకు దూరంగా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, కార్మికులు ఇప్పుడిప్పుడే కార్డులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం త రఫున కూడా తగిన అవగాహన కల్పించడంలో విఫ లమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రా మీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కార్మికులు లేబర్ కార్డుల గురించి సమాచారం పొందడం చాలా కష్టంగా మారుతోంది. అందువల్ల ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఏడు లక్షలకుపైగా జనాభా ఉండగా, వీరిలో దాదాపు రెండు లక్షల మంది వివిధ రంగాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. అయితే వీరిలో కేవలం 22,864 మంది మాత్రమే లేబర్ కార్డులు పొందారు. ఈ గణాంకాల ప్రకారం కార్మికుల్లో పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే లేబర్ కార్డులు పొందారు.
లేబర్ కార్డుతో ప్రయోజనాలు..
లేబర్ కార్డు ఉన్న కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కూతుళ్ల పెళ్లికి రూ.30 వేలు, ప్రసవానికి రూ.30 వేలు(ఇద్దరు కూతుళ్లకు మాత్రమే) సాయం అందుతుంది. ఈ ప్రయోజనాలు ఒక సంవత్సరం ముందు బోర్డులో కార్మికుడు లేదా కార్మికురాలుగా నమోదైనవారికే వర్తిస్తాయి. ప్రమాదంలో మరణించినప్పుడు బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, సాధారణ మరణానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. దహన సంస్కార ఖర్చుల కోసం రూ.30 వేలు అందజేస్తారు. ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగినవారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం ఇస్తారు. తాత్కాలిక వైద్య ఖర్చుల కింద నెలకు రూ.4,500 చొప్పున గరిష్టంగా రూ.13,500 సహాయం అందుతుంది. అదనంగా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల పిల్లల చదువులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తారు.
2018 నుంచి ఇప్పటివరకు
క్లెయిమ్‌ల వివరాలు
నిర్మల్ డివిజన్‌లో..
మొత్తం లేబర్ కార్డులు 11,258
ప్రసూతి క్లెయిమ్‌లు 585
చెల్లించిన డబ్బులు రూ.1,75,58,758
పెళ్లి గిఫ్ట్ 204
చెల్లించిన డబ్బులు 61,26,708
సాధారణ మరణం 99
చెల్లించిన డబ్బులు 1,26,63,019
యాక్సిడెంట్లు మరణం 4
చెల్లించిన డబ్బులు 25,20,152
భైంసా డివిజన్‌లో..
మొత్తం లేబర్ కార్డులు 11,606
ప్రసూతి క్లెయిమ్‌లు 913
చెల్లించిన డబ్బులు 2,74,21,476
పెళ్లి గిఫ్ట్ 283
చెల్లించిన డబ్బులు 88,00,195
సాధారణ మరణం 65
చెల్లించిన డబ్బులు 85,71,802
యాక్సిడెంట్లు మరణం 6
చెల్లించిన డబ్బులు రూ.41,50,189
నిరంతరం అందజేస్తున్నాం
లేబర్ కార్డు పొందేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. కార్మికులుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లేబర్ కార్డులు అందజేయడం జరుగుతుంది. జిల్లాలో 23 వేల మంది ఇప్పటి వరకు కార్డులు కలిగి ఉన్నారు. వచ్చేనెల 5వ తారీఖున కార్మికులకు అవగాహన కల్పించి మరింత మంది కార్డులు పొందేలా ప్రోత్సహిస్తాం.
– రాజలింగం,
లేబర్ ఆఫీసర్, నిర్మల్


