భైంసా: వచ్చే ఏడాది జూన్‌లో నిర్వహించే గోదావరి పుష్కరాల కోసం ముధోల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.27 కోట్లు మంజూరు చేసిందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. భైంసాలోని తన నివాసంలో ఆదివారం వివరాలు వెల్లడించారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఓని–బాసర రహదారి మరమ్మత్తులకు రూ.2.55 కోట్లు, గన్నోరా–ఓని రోడ్డుకు రూ.2 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి మహంకాళి ఆలయ రహదారికి రూ.1.20 కోట్లు, కిర్గుల్(బి)–బాసర రోడ్డు కనెక్టివిటీకి రూ.2.80 కోట్లు, బాసర రైల్వే స్టేషన్ నుంచి నావేగావ్ రోడ్డుకు రూ.1.35 కోట్లు, మల్కాపూర్ మీదుగా బాసరకు రూ.2.70 కోట్లు, ట్రిపుల్ ఐటీ నుంచి బాలాపూర్ రోడ్డుకు రూ.45 లక్షలు, పెట్రోల్ బంక్ నుంచి శాంకరి స్కూల్ వరకు రూ.45 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో బాసర అబాదీ నాలుగు లేన్ల రహదారిని పుష్కర ఘాట్ వరకు విస్తరించేందుకు రూ.8.50 కోట్లు, బిద్రెల్లి–ధర్మాబాద్ రెండు లేన్ల రహదారి విస్తరణకు రూ.4.65 కోట్లు, బాసర బస్‌స్టాండ్ రహదారి మరమ్మతులకు రూ.85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభించి, పుష్కరాల నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.


