దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి రోజూ వేలాదిమంది, పండుగలు, సెలవు దినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. పక్కనే వేలాదిమంది చదువుకునే ట్రిపుల్‌ఐటీ కూడా ఉంది. భక్తులు, విద్యార్థులు, స్థానికులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా బాసర ప్రాంతంలో సేవలను మరింత విస్తరించాలని ప్రస్తావించారు. ఖానాపూర్‌లో ఏరియాస్పత్రి ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో ప్రతిపాదించారు. ఖానాపూర్, పరిసర మండలాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం నిర్మల్, ఆదిలాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ ఏరియాస్పత్రి ఏర్పాటు చేస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కాగా, జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా ప్రజాప్రతినిధులు అందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఆశలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
భైంసా: జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు, ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు వచ్చే భక్తులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అవసరాల దృష్ట్యా వైద్యసేవలు మరింత విస్తరించాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, అత్యవసర వైద్యసేవలపై సమగ్రంగా చర్చించారు. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్, డయేరియా లాంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సరిహద్దు జిల్లా కావడంతోనే..
జిల్లా మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉండటంతో భైంసా, కుభీర్, బాసర, తానూర్ తదితర ప్రాంతాల ఆస్పత్రులకు రెండు రాష్ట్రాల ప్రజలు వైద్యసేవల కోసం వస్తుంటారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రోగుల రద్దీ పెరుగుతుండడంతో ప్రస్తుతమున్న సదుపాయాలు సరిపోవడం లేదు. ఆస్పత్రులను విస్తరించాలని, సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని, ఆధునిక పరికరాలు సమకూర్చాలని, అంబులెన్స్‌ల సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా ఏరియాస్పత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని, మెటర్నిటీ విభాగం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని 10 పడకలకు విస్తరించాలని, కుభీర్ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, అసంపూర్తిగా ఉన్న ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర పోస్టులను భర్తీ చేయాలని, కుభీర్, బాసర మండలాలకు ఒక్కొక్కటి, భైంసాకు అదనంగా మరో అంబులెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సేవలు మరింత విస్తరించాలని..


