ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా నిర్మల్ బోనమెత్తింది. పట్టణంలోని వివిధ కాలనీల మహిళలు ఉదయం నుంచే అమ్మవార్ల ఆలయాలకు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా బయల్దేరారు. బోనాల ఊరేగింపులతో వీధుల్లో పండుగ వాతావరణం కనిపించింది. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బంగల్‌పేట్ మహాలక్ష్మి, బుధవార్‌పేట్ పోచమ్మ, ప్రియదర్శినినగర్ కట్ట పోచమ్మ, ధ్యాగవాడ సారాగమ్మ, మంచిర్యాల రోడ్డు మారెమ్మ, డిగ్రీ కళాశాల అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సతీమణి కవిత మహాలక్ష్మి అమ్మవారికి, నందిగుండం దుర్గామాతకు బోనం సమర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్, శశాంక్, సూరజ్‌నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్‌రెడ్డి తదితరులు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంజులాపూర్‌లో గంగపుత్ర కులసంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. – నిర్మల్‌టౌన్/నిర్మల్‌చైన్‌గేట్/నిర్మల్‌ఖిల్లా


