ఉక్కు పరిశ్రమ కేంద్రంగా తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

ఉక్కు పరిశ్రమ కేంద్రంగా తెలంగాణ

Mar 3 2026 7:23 AM | Updated on Mar 3 2026 7:23 AM

బాసర: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం ‘తెలంగాణలో ఇనుము(ఉక్కు) పరిశ్రమ.. లోహశాస్త్రంలో విస్మరించబడిన అధ్యాయం’ అంశంపై గెస్ట్‌ లెక్చర్‌ కార్యక్రమం నిర్వహించారు. డా. జైకిషన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాచీన, మధ్యయుగాల్లో తెలంగాణ ప్రాంతం ఇనుము, ఉక్కు తయారీకి ప్రపంచ కేంద్రంగా నిలిచిందని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తరించిన ఈ పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధ ‘డమాస్కస్‌’ ఖడ్గాల తయారీకి మూలమని చెప్పారు. 2,800 గ్రామాల్లో చేసిన సర్వేలో 2,600 గ్రామాలు ఇనుము కరిగించే కేంద్రాలుగా ఉన్నట్టు గుర్తించారన్నారు. వీటిలో 600 గ్రామాల్లో మట్టి మూసలతో అత్యున్నత నాణ్యమైన ఉక్కును తయారు చేసేవారని ఆధారాలతో వివరించారు. నిజామాబాద్‌ జిల్లా కోనసముద్రం గ్రామం మధ్యయుగంలో ‘వుట్జు’(ఉక్కు గడ్డలు) పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఇక్కడి ఉత్పత్తులు ఐరోపా, పశ్చిమ దేశాలకు ఎగుమతి అయ్యేవని తెలిపారు. తెలుగు పదాలు ‘కొలిమి’, ‘కమ్మరి’, ‘చిత్యం’ ఆనాటి లోహశాస్త్ర సమాజంతో గాఢ సంబంధాన్ని సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. 1857 స్వాతంత్య్ర పోరాటం తర్వాత బ్రిటిష్‌ కఠిన చట్టాలు, ఐరోపా పారిశ్రామిక విప్లవ ప్రభావంతో స్వదేశీ సాంకేతికత కనుమరుగైందని తెలిపారు. మెటలర్జీ విభాగాధిపతి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఈ పురాతన సాంకేతికతను ఆధునిక ఇంజనీర్లు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌, ఓఎస్డీ, పరిపాలన అధికారి ప్రొఫెసర్‌ ఇ.మురళీ దర్శన్‌, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు డాక్టర్‌ వి.అజయ్‌, డాక్టర్‌ ఆర్‌.అజయ్‌, డాక్టర్‌ భాస్కర్‌, జి.సుధాకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement