సీట్ల పంచాయితీ..!
నిర్మల్: నేడో, రేపో పురపోరుకు నగారా మోగనుండటంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో సీట్ల పంచాయితీ ముదురుతోంది. ఒక్కో వార్డులో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరుముగ్గురు బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికివారు తగ్గేదే లేదన్నట్లుగా ఉన్నారు. ఇందులో ఎవరికి టికెట్ ఇవ్వాలి, మిగతా వారిని ఎలా బుజ్జగించాలనే విషయంలో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. అందరి అభ్యర్థనలు వింటూనే గెలుపుగుర్రాలను ఎంపిక చేయడంలో సదరు నేతలు బిజీబిజీగా ఉంటున్నారు. కులాలు, వర్గాలు, బలాల ప్రకారం ఆరా తీస్తూ.. ఏ ప్రకారం ఎవరికి సీటిస్తే గెలుస్తామన్న లెక్కలు వేస్తున్నారు. మరోవైపు చాలామంది కాంగ్రెస్, బీజేపీ ఆశావహులు తమకు టికెట్ రాకపోతే రెబల్‌గానైనా బరిలో దిగాలన్న యోచనలో ఉన్నారు.
బరిలో నిలిచేందుకు పోటాపోటీ
ఐదేళ్లలో రాజకీయాలు మారిపోయాయి. బీఆర్‌ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ పుంజుకోవడం ఇవన్నీ.. జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఇప్పుడు హాట్‌కేకుల్లా మారాయి. ప్రధానంగా నిర్మల్‌లో ఈ రెండు పార్టీల సీట్ల కోసం ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు ఉండటం గమనార్హం. భైంసాలో బీజేపీ, ఎంఐఎం నుంచి పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఖానాపూర్‌లో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇక్కడ బీఆర్‌ఎస్ నుంచీ పోటీ చేయడానికి చాలామంది ఆసక్తిచూపుతున్నారు.
కాంగ్రెస్‌లో చాలాకష్టం!
అధికార కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ టికెట్ తీసుకోవడం చాలాకష్టంగా మారింది. ఆ పార్టీలో సీనియర్ నేతలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. నిర్మల్ మున్సిపాలిటీలో నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ లాంటి సీనియర్ నేతలున్నారు. వారికంటూ కొన్ని స్థానాలు ఇవ్వాలన్న లెక్కలూ పెట్టుకుంటున్నారు. మరోవైపు ఎలాగైనా నిర్మల్ బల్దియాను కై వసం చేసుకోవాలని కొంతకాలంగా మాజీ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి పక్కా ప్లాన్‌తో పనిచేస్తున్నారు. ఇప్పటికే వార్డులవారీగా తనకంటూ ఓ ప్యానల్‌నూ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఎవరిది పైచేయి అవుతుంది.. ఎవరి వర్గానికి కౌన్సిలర్ టికెట్లు వస్తాయనేది తేలడం లేదు. భైంసా కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావుపటేల్, విఠల్‌రెడ్డి వర్గీయులు పోటీపడుతున్నారు. ఖానాపూర్‌లో మాత్రం ఎమ్మెల్యే బొజ్జుపటేల్ నిర్ణయమే ఫైనల్‌గా కనిపిస్తోంది.
బీజేపీలో భిన్నంగా..
కాంగ్రెస్‌తో పోలిస్తే ఈసారి బీజేపీలో కౌన్సిలర్ ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడంతో పాటు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటడంతో పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. నిర్మల్, భైంసాలో ఒక్కోవార్డు నుంచి నలుగురైదుగురూ పోటీపడుతున్నారు. బీజేపీలో సీనియర్ నేతలున్నా.. టికెట్ల కేటాయింపుల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిందే వేదమన్నట్లు కనిపిస్తోంది. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి, భైంసాలో రామారావుపటేల్ చెప్పినవారికే కౌన్సిలర్ టికెట్లు వస్తాయన్న ప్రచారముంది. పార్టీ అధిష్టానం పరిశీలకులను పంపినా చివరకు వారు ఎవరిపేరు చెబితే అదే అన్నట్లుగా ఉంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ ప్రభావం చూపుతున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్‌లో దస్తీ వేసి..
పదేళ్లు అధికారాన్ని చెలాయించిన బీఆర్‌ఎస్ ఖానాపూర్‌లో కొంత ప్రభావం చూపుతున్నా.. నిర్మల్, భైంసాల్లో మాత్రం నామమాత్రంగానే కనిపిస్తోంది. తప్పనిసరి బరిలో నిలువాలనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ ఆశావహులు అక్కడ టికెట్ రాకపోతే బీఆర్‌ఎస్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు మాత్రం తమపార్టీ ఆశావహులకే టికెట్లు ఇస్తామని చెబుతోంది.


