మార్మోగిన సాయినామం
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ హన్మాన్ ఆలయ 29వ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి, నందిపేట్‌కు చెందిన కేదర నందస్వామి, రాములు మహరాజ్, పండితులు రామకృష్ణశర్మ, శశిధర్‌శర్మ, మల్లేశ్ తదితరులు సాయిబాబా మూలవిరాట్టుకు మహాకుంభాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతులు, లక్ష్మీనారాయణుల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. మహా పూర్ణాహుతి, అన్నపూజ నిర్వహించారు. లక్షకు పైగా భక్తులు హాజరు కాగా, ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక కళా సమాఖ్య ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టుడు, పల్లకీసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఆవరణలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులతో కిటికిటలాడాయి. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్ వేర్వేరుగా హాజరై పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొక్కుల ప్రదీప్, గుగ్గిల్ల రాజేందర్‌గౌడ్ వీరిని సన్మానించారు.
మార్మోగిన సాయినామం


