క్యాన్సర్‌పై టీకాస్త్రం!
నిర్మల్‌చైన్‌గేట్: మహిళల్లో ఎక్కువగా వస్తున్న గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. ఇందుకోసం జిల్లాలోని 14ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పీహెచ్‌సీల వారీగా వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. బాలికల భవి ష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఖరీదైన ఈ వ్యాక్సిన్‌ను జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఇవ్వనుంది.
జిల్లాలో కిశోర బాలికల సర్వే
సర్వైకల్ క్యాన్సర్‌ను నియంత్రించే హెచ్‌పీవీ టీకా ను కిశోర బాలికలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా దీనిపై ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపున్న 7,684 మంది కిశోర బాలికలను గుర్తించారు. వారికి ఒక డోసు హెచ్‌పీవీ టీకా వేస్తే భవిష్యత్‌లో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ము ప్పు తలెత్తకుండా ఉంటుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
నివారణ చర్యలపై దృష్టి
కిశోర బాలికల విషయంలో హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్ఫెక్షన్ సోకి క్యాన్సర్‌కు దారితీస్తుంది. చాలామంది ఈ వైరస్‌ను గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తారు. అండాశయం పొట్టలో ఉండటంతో లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చు. పొత్తి కడుపు ఉబ్బి నొప్పిగా ఉండటం, అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలుంటే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదిస్తే కట్టడి చేయవచ్చు. మహిళలను బాధిస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. చిన్నారుల భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా ఇవ్వనున్నారు.
సిబ్బందికి శిక్షణ ఇచ్చాం
జిల్లావ్యాప్తంగా బాలికలకు టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. మొదటి విడతలో 14–15 ఏళ్ల బాలికలకు వేస్తాం. అన్ని పీహెచ్‌సీల్లో టీకా ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే టీకా వేయడం ప్రారంభిస్తాం. ఈ టీకాతో ఎలాంటి సమస్యలు రావు.
– రాజేందర్, డీఎంహెచ్‌వో
మార్గదర్శకాల ప్రకారమే..
జిల్లాలో 14 ఏళ్లు నడిచే బాలికల గుర్తింపు సర్వే ముగిసింది. హెచ్‌పీవీ టీకాలు త్వరలో జిల్లాకు చేరే అవకాశముంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌పీవీ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర టీకాల మాదిరిగానే అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమం చేపడతాం.
– నయనారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
రెండేళ్లలో ఆరోగ్య మహిళా క్లినిక్‌ల ద్వారా అందించిన సేవలు
మొత్తం రిజిస్ట్రేషన్లు 22,800
రిఫర్ చేసినవి 943
క్యాన్సర్ స్క్రీనింగ్
ఓరల్ 4,714
బ్రెస్ట్ 4,674
సర్వైకల్ 801
క్యాన్సర్ నిర్ధారణ
సర్వైకల్ క్యాన్సర్ 11
ఓరల్ క్యాన్సర్ 1
బ్రెస్ట్ క్యాన్సర్ 2


