జిల్లాకు మరో స్టేడియం..! | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు మరో స్టేడియం..!

Jan 20 2026 7:35 AM | Updated on Jan 20 2026 7:35 AM

జిల్లాకు మరో స్టేడియం..!

జిల్లాకు మరో స్టేడియం..!

● సీఎం రేవంత్‌ హామీ ● స్థల పరిశీలనలో అధికారులు ● ఇప్పటికే ఉన్న స్టేడియాలపై పర్యవేక్షణ కరువు

భైంసాలో పట్టణానికి దూరంగా పార్డి(బి) బైపాస్‌ మార్గంలో స్టేడియం నిర్మించారు. దీంతో క్రీడాకారులకు అందుబాటులో లేక నిరుపయోగంగా మారింది. ఇండోర్‌ భవనం పైకప్పు రేకులు ఎగిరిపోగా, గోడలు బీటలు వారాయి. తలుపులు, కిటికీలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. కొన్నిరోజులు టీఎస్‌ పోలీస్‌ బెటాలియన్‌ కోసం కేటాయించగా, బెటాలియన్‌ భవనం పూర్తి కావడంలో ప్రస్తుతం స్టేడియం నిరుపయోగంగా ఉంది.

ఖానాపూర్‌లోనూ పట్టణానికి దూరంగా మినీ స్టేడియం నిర్మించారు. ఇక్కడా భవనం శిథిల దశకు చేరుకోగా, స్టేడియంల వద్ద కనీసం వాచ్‌మెన్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సాయంత్రమైతే మందుబాబులు చేరుతున్నారు. ఆయా స్టేడియాల్లో కోచ్‌లను నియమించకపోవడంతో ఆటలు ఆడించేవారు లేక క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో శిక్షణకు నోచుకోవడం లేదు. మినీ స్టేడియాలపై జిల్లా క్రీడల అధికారి పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారాయి. ఆకతాయిలు చేరి భవనాల కిటికీలు, తలుపులు ధ్వంసం చేస్తున్నారు. అందులోని సామగ్రి సైతం చోరీ అవుతోంది.

నిర్మల్‌లో ఎన్టీఆర్‌ మినీ స్టేడియం ఉన్నా అడపా దడపా క్రీడలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు.. తప్ప జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి తెచ్చే చర్యలు తీసుకోవడం లేదు. గతంలో స్టేడియంలో చోరీ జరిగి సామగ్రి ఎత్తుకెళ్లారు. అంతేగాక, మినీ స్టేడియం క్రమేపీ ఆక్రమణకు గురవుతోంది.

భైంసాటౌన్‌: జిల్లా క్రీడాకారులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. అన్ని వసతులతో కూడిన స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎంను కోరారు. ఈ మేరకు స్పందించిన సీఎం జిల్లాకు మరో స్టేడియం మంజూరు చేస్తామని చెప్పారు. దీంతో ఇండోర్‌, అవుట్‌ డోర్‌ గేమ్స్‌తోపాటు అన్ని వసతులు, హంగులతో కూడిన కొత్త స్టేడియం ఏర్పాటు కానుంది. ఇందుకు అవసరమైన స్థలాన్ని అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే చించోలి(బి) వద్ద ఐదెకరాల స్థలం అందుబాటులో ఉండగా, 10 నుంచి 15 ఎకరాల స్థలం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్థలం పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు.

రెగ్యులర్‌ అధికారి లేక..

జిల్లాలో క్రీడల శాఖకు రెగ్యులర్‌ అధికారి కరువయ్యారు. బాక్సింగ్‌ కోచ్‌కు బాధ్యతలు అప్పగించడంతో ఆయనే జిల్లా యువజన సంక్షేమ, క్రీడల శాఖ అధికారిగా కొనసాగుతున్నారు. కాగా, జిల్లాలో క్రీడల నిర్వహణతోపాటు, క్రీడా మైదానాలపై సరైన పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా స్టేడియాల్లో కోచ్‌ల నియామయకం లేక జిల్లాలో క్రీడాకారులు నష్టపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెగ్యులర్‌ అధికారిని నియమించి క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కోచ్‌లను నియమిస్తాం..

భైంసా, ఖానాపూర్‌ మినీ స్టేడియాల్లో కోచ్‌లు లేక క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు. త్వరలోనే స్టేడియంలలో కోచ్‌లను నియమిస్తాం. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటాం. చించోలి(బి) వద్ద మరో స్టేడియం మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన స్థలం పరిశీలిస్తున్నాం.

– శ్రీకాంత్‌రెడ్డి, డీవైఎస్‌వో, నిర్మల్‌

ఉన్నవి నిరుపయోగం...

ఇదిలా ఉండగా, ఇప్పటికే మండలానికి ఒక స్టేడియం కింద గత ప్రభుత్వం ముధోల్‌ నియోజకవర్గంలోని భైంసా, ఖానాపూర్‌లో, నిర్మల్‌ నియోజకవర్గంలో చించోలి(బి) వద్ద మినీ స్టేడియం మంజూరు చేసింది. వీటిలో భైంసా, ఖానాపూర్‌లలో స్టేడియం నిర్మాణాలు పూర్తి చేసుకోగా, ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫలితంగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికీ ఈ స్టేడియాలు క్రీడాకారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement