కోడ్ కూయక ముందే మొదలయ్యేనా?
భైంసాటౌన్: మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకం కింద నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు నిర్మల్, భైంసా, ఖానాపూర్‌కు రూ.15 కోట్ల చొప్పున రూ.45 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఇదివరకే పనులు గుర్తించి, ప్రతిపాదనలు పంపారు. పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.
పనులతో ప్రయోజనం..
పట్టణాల్లో చాలావరకు కాలనీల్లో సీసీ రోడ్లు అధ్వానంగా మారాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలపై కల్వర్టులు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల నాసిరకం పనులు చేపట్టడంతో కంకర తేలి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇరుకు రోడ్లు ఇబ్బందిగా మారాయి. గుంతల రోడ్లకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో గతంలో ప్రతిపాదించిన పనులతోపాటు కొత్తగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
కోడ్ గండం..!
పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించనున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుందన్న ప్రచారం నేపథ్యంలో అభివృద్ధి పనులు మొదలవుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. దీంతో పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేగాక, ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త పాలకవర్గం ఈ పనులను చేపడుతుందా.. మళ్లీ కొత్తగా ప్రతిపాదిస్తుందా అన్న సందేహాలూ ఉన్నాయి.


