వసంత పంచమికి ఏర్పాట్లు చేయండి
బాసర : బాసరలో ఈ నెల 23న నిర్వహించే వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌తో కలిసి ఆలయ ఈవో కార్యాలయంలో అర్చకులు, అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించి, భక్తుల సంఖ్యను అంచనా వేస్తూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాన్ని పూలు, లైటింగ్‌తో అలంకరించాలన్నారు. రద్దీని నియంత్రిస్తూ దర్శనాలకు ఏర్పాటు చేయాలి. క్యూలైన్లలో చిన్నారులకు పాలు, పండ్లు అందించాలన్నారు. తాగునీరు, బయోటాయిలెట్లు, చెత్తబుట్టలు, ప్రసాదం, బేబీ ఫీడింగ్ గదులు, సీసీ కెమెరాలు సిద్ధం చేయాలని తెలిపారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలు, వైద్య శిబిరాలు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
గోదావరి ఘాట్లు శుభ్రంగా ఉంచాలి..
దేవాలయం, గోదావరి పుష్కర ఘాట్‌లు నిరంతర పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. సీ్త్ర–పురుషులకు వేర్వేరుగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్‌లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద ఆలయాకి వెళ్లే దారి సూచన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక బస్సులు నడపాలని తెలిపారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు..
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ సరస్వతి దేవి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అక్షరాభ్యాస కార్యక్రమాలకు పురోహితులను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కలెక్టర్‌కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమావేశంలో భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, దేవాలయ ఏఈవో సుదర్శన్‌గౌడ్, సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


