పుర పీఠాలపై గురి!
నిర్మల్‌లో బీసీ మహిళ..
జిల్లా కేంద్రమైన నిర్మల్ మున్సిపాలిటీలో ఈసారి జనరల్ మహిళ చైర్‌పర్సన్ కానుంది. గత రెండు పర్యాయాలు బీసీ జనరల్ రాగా, ఈసారి జనరల్ మహిళను రిజర్వేషన్ వరించింది. గతంలో అయ్యన్నగారి భూలక్ష్మి, అప్పాల అనురాధ మహిళ చైర్‌పర్సన్లుగా పనిచేశారు. నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఎంఐఎం పూర్వవైభవం సాధిస్తామంటోంది. ఇక్కడ బీఆర్‌ఎస్ నామమాత్రంగా ఉంది. కాంగ్రెస్‌లో గతంలో చైర్మన్‌గా చేసిన అప్పాల గణేశ్‌చక్రవర్తి వర్గానికే అవకాశం ఇస్తారన్న ప్రచారం ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మద్దతు ఆయనకు ఉండటంతో గణేశ్‌చక్రవర్తి వర్గానికే చైర్‌పర్సన్ అవకాశం వస్తుందంటున్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు చైర్‌పర్సన్ స్థానంపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఎవరు పోటీ పడుతున్నారనే క్లారిటీ కూడా నేతల్లోనే కనిపించడం లేదు. పలువురు సీనియర్ కౌన్సి లర్లు ఆశిస్తున్నా.. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఏదీ తేల్చడం లేదన్న వాదన వినిపిస్తోంది.
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఓటరు జాబితా ఫైనల్ కావడమే ఆలస్యం వార్డులు, చైర్మన్ స్థానాల రిజర్వేషన్లూ ఖరారు చేసేశారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదలైంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల రిజర్వేషన్లు జిల్లా కలెక్టరేట్‌లో ప్రకటించారు. చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో వెల్లడించారు. దీంతో కౌన్సిలర్ పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు కలిసి రావడంతో హర్షం వ్యక్తంచేస్తుండగా, కలిసిరాని వారు ఉసూరుమంటున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ బరిలో నిలిచేదెవరన్నదే చర్చనీయాంశంగా మారింది. మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల పరిస్థితి విభిన్నంగా ఉంది.
భైంసా అన్ రిజర్వుడ్..
పదేళ్లపాటు బీసీ మహిళ రిజర్వేషన్ ఉన్న భైంసా చైర్మన్ స్థానం ఈసారి అన్‌రిజర్వుడ్ అయ్యింది. గత రెండు పర్యాయాలు ఎంఐఎంకు చెందిన సబియాబేగం చైర్‌పర్సన్‌గా కొనసాగారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత భైంసాలోనే వరుసగా ఎంఐఎం బల్దియాను దక్కించుకుంటోంది. ఈసారి జనరల్ కావడంతో పోటీ బలంగా ఉండనుంది. ఎంఐఎం నుంచి సీనియర్‌నేత జాబీర్‌అహ్మద్ బరిలో నిలువనున్నారు. గతంలో తొమ్మిది స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈసారి చైర్మన్ స్థానంపై కన్నేసింది. ఈ పార్టీ నుంచి గతంలో ఓసారి చైర్మన్‌గా చేసిన గంగాధర్‌తోపాటు యువనేత తూమోల్ల దత్తు పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గత పాలకవర్గంలో ఖాతా కూడా తెరవని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఈసారి కొన్ని స్థానాలైనా గెలుస్తామంటున్నాయి.


