జీవో 252 సవరించాలి
నిర్మల్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను సవరించాలని టీయూడబ్ల్యూజే 143 యూనియన్ సభ్యులు అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై తీసుకువచ్చిన జీవోను సవరించాలని కోరుతూ.. కలెక్టరేట్‌లో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన అక్రిడిటేషన్ల జారీ కోసం జీవో 252 తీసుకురావడం అభినందనీయమన్నారు. అయితే ఈ జీవోలోని కొన్ని నిబంధనలతో ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు కలిగిన దాదాపు 10 వేల మందికి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్ట్ అన్న తేడా లేకుండా అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ నా యకులు లక్ష్మీనారాయణ, రాంమహేశ్, మహేశ్‌రావు, అల్లం అశోక్, రాంపెల్లి నరేందర్, అత్తర్, రంజిత్, కార్తీక్, రాజు తదితరులు ఉన్నారు.


