సిరాల ఆయకట్టుకు సాగునీరు
భైంసారూరల్: యాసంగి పంటలకు సిరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ అన్నారు. సిరాల ప్రాజెక్టు కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.12 కోట్లతో పనులు పూర్తి చేయించామన్నారు. సిరాల ప్రాజెక్టు ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. చెరువుల నిర్మాణానికి, లిఫ్ట్‌ల పునఃప్రారంభానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అనిల్‌కుమార్, సిరాల, ఇలేగాం, దేగాం, చింతల్‌బోరి గ్రామాల సర్పంచులు కదం సునంద, సీరం రాజమణి, సీరం సుష్మారెడ్డి, పండిత్‌రావుపటేల్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు.


