గ్రామాల అభివృద్ధిపై ‘కొత్త’ ఆశలు
భైంసారూరల్: కొత్త సర్పంచులు కొలువుదీరారు. దీంతో ఇన్నాళ్లు నిలిచిపోయిన అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచిపోయాయి. గ్రామీణ అభివృద్ధి ఆగిపోయింది. పంచాయతీల తర్వాత పాలకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
నిర్వహణలో లోపాలు..
రెండేళ్లు పంచాయతీల నిర్వహణ గాడితప్పింది. చెత్త సేకరణ ట్రాక్టర్లు డీజిల్ లేక నిలిచాయి. ప్రకృతి వనాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. డ్రెయినేజీల నిర్వహణ లేక కంపుకొడుతున్నాయి. మురుగునీరు నిలిచి దోమలు, ఈగలు పెరిగాయి. ఈ సమస్యలు కొత్త నాయకులకు ప్రధాన సవాల్‌గా మారాయి.
కార్యదర్శులకు తప్పిన భారం
పంచాయతీ కార్యదర్శులు ఇంతకాలం పాలనను పర్యవేక్షించారు. అత్యవసర పనులకు నిధులు లేకపోవడంతో అప్పులు చేసి చేపట్టారు. కొత్త సర్పంచులు రావడంతో కార్యదర్శులపై భారం తప్పింది. అయితే పాత బిల్లుల చెల్లింపు, కొత్త పనుల మధ్య సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం నిధుల విడుదల ఆధారంగా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది.
పరిష్కార మార్గాలు..
కొత్త పాలకులు పారిశుధ్య నిర్వహణపై దృష్టి పె ట్టాలి. ఇంటింటా చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల నిర్వహణ మెరుగుపర్చాలి. డ్రెయినేజీలు శుభ్రం చే యించాలి. ప్రభుత్వ పథకాలతో గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామసభలు క్ర మం తప్పకుండా నిర్వహించి ప్రజల సమస్యలు తె లుసుకోవాలి. ప్రజల ఆకాంక్ష మేరకు చర్యలు తీసుకుంటూ అభివృద్ధి దిశగా సాగాలి. ఈ వ్యూహంతో గ్రామాలు మెరుగైన పరిస్థితికి చేరుకుంటాయి.


