యాప్‌లోనే యూరియా
కొత్త యాప్‌ను తీసుకొచ్చిన వ్యవసాయ శాఖ ఇష్టానుసారం వాడకానికి చెక్.. ఎకరా వరికి కేవలం 2, మొక్కజొన్నకు 3, మిర్చికి 5 బస్తాలు మాత్రమే..
నిర్మల్‌చైన్‌గేట్: వానాకాలం పంటలకు సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బంది పడ్డా రు. చాలా మంది అదనుకు ఎరువు వేయలేకపోయారు. దీంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ఇక చాలాచోట్ల రైతుల యూరియా కోసం రోడ్లెక్కారు. ఈ నేపథ్యంలో యాసంగిలో అలాంటి సమస్య రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్‌లో సకాలంలో ఎరువులు అందించడంతోపాటు వాడకాన్ని నియంత్రించేందుకు యూరియా బుకింగ్ యాప్‌ను తెచ్చింది. ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇంటి నుంచే బుకింగ్ చేసి సమీప దుకాణాల్లో ఎరువులు స్వీకరించవచ్చు.
యాసంగి సాగు ఇలా..
జిల్లాలో యాసంగి సీజన్‌లో 2.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా. వరి 1.30 లక్షల ఎకరాలు, మొక్కజొన్న లక్ష ఎకరాలు, శనగ 50 వేల ఎకరాలతోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు కూడా ఉన్నాయి. ఈ పంటలకు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 11 వేల టన్నుల నిల్వలు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సరఫరాలు చేస్తారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే..
రైతులు తమ అవసరాల ప్రకారం కాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మాత్రమే యూరియా పొందుతారు. యాప్‌లో పంట వివరాలు, ఎకరాల సంఖ్య నమోదు చేస్తే అవసరమైన బస్తాలు, సమయాలు సూచిస్తుంది. శాస్త్రవేత్తల సిఫారసు ప్రకారం ఎకరానికి వరికి 2 బస్తాలు, మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్నకు 2 బస్తాలు, శనగకు 1 బస్తా కేటాయిస్తారు. బుకింగ్ తర్వాత సమీప దుకాణాల్లో స్వీకరించవచ్చు.
యాప్ వినియోగం ఇలా..
మొబైల్‌లో యాప్ తెరిచి సిటిజన్ లాగిన్ ఎంపికలో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అ వ్వాలి. రాష్ట్ర, జిల్లా, సీజన్ (రబీ/ఖరీఫ్), పాస్ బుక్ నంబర్, పంటల వివరాలు నమోదు చే యాలి. ఆధారంగా బస్తాల సంఖ్య, 15 రోజుల్లో దశలవారీ సరఫరా వివరాలు కనిపిస్తాయి. పాస్‌బుక్ లేని కౌలు రైతులు ఆధార్‌తో నమోదు చేసుకోవచ్చు. బుకింగ్ ఐడీతో దుకాణంలో డబ్బు చెల్లించి ఎరువులు పొందాలి.
కొనసాగుతున్న శిక్షణ..
యూరియా బుకింగ్ యాప్‌పై మండల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులకు మొదట శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం డీలర్లు, పీఏసీఎస్ సీఈఓలకు శిక్షణ కొనసాగుతుంది. ఈ నెల 20 నుంచి యాప్‌ను ప్రారంభించాం. రైతులకు, డీలర్లకు అవగాహన కల్పిస్తున్నాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


