జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజల ఉపాధిని దెబ్బతీసే జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఎంజీఎన్‌ఆర్ ఈజీఎస్ పథకాన్ని రద్దుచేసి కొత్తగా తెచ్చిన ప్రజల ఉపాధిని దెబ్బతీసే జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జిల్లా నాయకులు నందిరామయ్య, దుర్గం నూతన్‌కుమార్, ఎస్‌ఎన్.రెడ్డి, జే.రాజు, కె.రాజన్న, సురేశ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గుడ్డిలో మెల్లగా, ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో కొత్తగా జీ రామ్‌జీ చట్టాన్ని తీసుకురావడం దేశంలోని పేద బడుగు బలహీనవర్గాల ఉపాధిని దెబ్బతీయడమేనని విమర్శించారు. చట్టంలో పని హక్కుని తీసి వేయడం, 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయించడం చూస్తుంటే రానున్న రోజుల్లో చట్టాన్ని, ఉపాధి హ క్కుని రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. జీ రామ్‌జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని, మెరుగైన ఉపాధి చట్టాన్ని సాధిస్తామన్నారు. నిరసనలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, మహమూద్, రామ్‌లక్ష్మణ్, బక్కన్న, సుజాత, వెంకటేశ్, నారాయణ, గంగన్న పాల్గొన్నారు.


