ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
భైంసాటౌన్/బాసర: బాసర పీహెచ్‌సీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ భీమన్న ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. భీమన్న బాసర పీహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా, తానూర్ పీహెచ్‌సీ ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. అదే పీహెచ్‌సీలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి సంబంధించి జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు ముందుగా తయారు చేసినందుకు, అలాగే వైద్య చెల్లింపు బిల్లులకు భీమన్న రూ.9 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఫోన్ పే ద్వారా నగదు పొందినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం నిందితుడిని భైంసాలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పర్చనున్నట్లు వెల్లడించారు. అనంతరం బాసర పీహెచ్‌సీలో ఏసీబీ అఽధికారులు రాత్రి వరకు పలు రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.


