ఎలక్షన్ హౌస్
తానూరు : పంచాయతీ ఎన్నికల కోసం ఓ సర్పంచ్ అభ్యర్థి ఏకంగా కంటైనర్ ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న తానూర్ మండలం జౌలా(కే) గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వినోద్ పోటీ చేస్తున్నాడు. ఎన్నికల కోసం తన ప్లాట్‌లో రూ.7 లక్షలతో కంటైనర్ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ రమణ పొందిన వినోద్ తండ్రి దేవురావ్ కుటుంబం 15 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో స్థిరపడింది. వినోద్ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వ్యవసాయ భూములు చూసుకునేవాడు. స్వగ్రామంలో ఇంటి స్థలం, పొలాలు ఉన్నా ఇల్లు లేదు. దీంతో స్థానికులు సొంత ఇల్లు లేకపోతే సర్పంచ్‌గా గెలిపించరని భావించాడు. దీంతో నిర్మాణానికి సమయం లేకపోవడంతో గత నెలలో హైదరాబాద్ నుంచి కంటైనర్ ఇల్లు తీసుకువచ్చి తన ప్లాట్‌లో ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. ఇప్పుడు ఇక్కడే ఉంటూ ఇక్కడి నుంచే ఎన్నికల కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. సకల సౌకర్యాలు ఉన్న ఆ కంటైనర్ ఇంటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు.


