మీ పల్లెను మాట్లాడుతున్న..
సర్పంచ్ అభ్యర్థీ ఒక విన్నపం ఓటర్ లిస్టును కాదు.. సమస్యల జాబితా చూడు మభ్యపెట్టి ఓట్లు అడుగకు.. తీర్చగలిగితేనే హామీ ఇవ్వు.. వీలైతే బాగుపర్చు.. వ్యసనాలకు బానిస చేయకు
నిర్మల్: నేను మీ పల్లెను మాట్లాడుతున్న.. సంగ్రామంలో తలపడుతున్న సర్పంచ్ అభ్యర్థులకు నాదో విన్నపం.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చూస్తున్న మీ తీరుని. పుట్టినప్పటి నుంచి చూస్తున్న ఈ పంచాయతీ పోరుని. అప్పట్లో అంతోఇంతో ఊరికోసం పనిచేయాలన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. కొన్నేళ్లుగా అలాంటి వాళ్ల సంఖ్య తగ్గుతుంటే బాధేస్తోంది. పార్టీల పేరుతో ఒక్క ఊరిలోనే వర్గాలుగా చీలిపోతున్నారు. ఊరి బాగుకంటే.. పదవిపై మోజుతోనే చాలామంది ముందుకు వస్తున్నారు. కుర్చీ కోసం ఏమైనా చేస్తున్నారు. ఇంతమంది పోటీపడేది కేవలం పదవి కోసమేనా..!? సర్పంచ్‌గా గెలువడానికి ఏదైనా చేయాలా..!? అభ్యర్థుల చేతుల్లో ఓటరు లిస్టు ఉంటే చాలా..!? వారిని సంతృప్తి పరిస్తే సరిపోతుందా..!? గ్రామ సమస్యల జాబితా అవసరం లేదా..!? అసలు ఈ ఊరికేం కావాలో ఆలోచించరా..!? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఒక్క ఆశ ఏంటంటే. ఒకప్పటి తరం కాదిది. ఇప్పుడున్నది ‘స్మార్ట్’గా ఆలోచించే జెన్‌జీ రోజులు. ఇప్పుడొచ్చే.. యువతరమైనా ఊరు ఏం కోరుతుందో తెలుసుకోవాలి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే నా తాపత్రయం.
పదవిపైనే మోజు..
‘సర్పంచ్‌సాబ్..’ అని అనిపించుకోవాలన్న మోజులోనే మస్తుమంది ఎన్నికల్లో పోటీకి దిగుతుండ్రు. పల్లె రాజకీయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీల డైరెక్టర్లు, చైర్మన్ల కన్నా సర్పంచ్ పదవికి అధికారాలు, నిధులు ఎక్కువగా ఉండటమూ ఇందుకు ఓ కారణమే. ఊరుఊరంతా సర్పంచ్‌కు గౌరవ మర్యాదలిస్తుంది. ప్రతీదానికీ తననే ముందు నిలుపుతుంది. అది.. ఆ పదవిలో ఉన్న మనిషికి కాదు, ఆ కుర్చీకి ఉన్న గౌరవమే. ఆ పదవిని పద్ధతిగా సద్వినియోగం చేసుకుని, ఊరిని బాగుపర్చిన సర్పంచ్‌ల పేర్లు తరాలు గడిచిపోయినా ఊళ్లో నానుతూనే ఉన్నాయి. వాళ్లు చేయించిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ.. పదవిని అడ్డుపెట్టుకుని సంపాదించాలన్న దురాలోచన, అవసరంలేని రాజకీయాలతో చాలామంది సర్పంచ్‌లు ఉన్న పేరునూ ఖరాబ్ చేసుకున్నారు. అందుకే అభ్యర్థులూ.. పదవిపై మోజుతో పోటీచేస్తున్నారా..! అయితే.. గెలిస్తే మీ పేరు ఈ ఐదేళ్లకే పరిమితం.
ఓటర్‌లిస్ట్ కాదు..
‘ఊళ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఎంతమంది మనోళ్లు ఉన్నారు. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి. ఏయే సంఘానికి ఏమేం కొనివ్వాలి..!’ ఇవి కాదు మీ చేతుల్లో ఉండాల్సింది. అసలు.. ఊరికి ఏం కావాలో గుర్తించండి. ఓటరు లిస్టు కంటే ముందు, గ్రామ సమస్యల జాబితాను చూడండి. మీరు చేయగలిగే పనులనే చేస్తామని చెప్పండి. తీర్చలేని హామీలను ఇచ్చి అభాసుపాలు కావొద్దు. ఏళ్లుగా ఊరిని పట్టి పీడిస్తున్న కష్టాలు గుర్తించి, వాటి పరిష్కారానికి ఏం చేస్తారో, ఎలా చేస్తారో గ్రామస్తులకు వివరించాలి.
ఓటరూ ఆలోచించు..
ఓట్ల కోసం ఊరిని వ్యసనాలకు బానిస చేయొద్దు. ఎన్నికలప్పుడే కదా.. ఈ వారం రోజులే కదా.. అని గ్రామస్తులను ప్రధానంగా యువతను మద్యానికి బానిస చేయొద్దు. చాలామంది అఽభ్యర్థులు ఓటు కావాలంటే నోటు, క్వార్టరు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉన్నారు. ఇలా వీటితో గెలిచి సర్పంచ్ అయితే.. నీ నుంచి ఊరు ఏం ఆశిస్తుందోనన్న ఆలోచనా చేయాలి. ఈ సర్పంచ్ పదవి అనేది ప్రజలు గౌరవం ఇస్తేనే బాగుంటుంది. లేదంటే.. పేరుకే పరిమితమవుతుంది. ఊరు బాగుంటే.. అందరూ బాగుంటారు.


