1.. 2.. 3.. ప్రచారం స్పీడ్!
ముగిసిన మూడు విడతల నామినేషన్ల పర్వం ఇప్పటికే ప్రజల్లోకి మొదటి విడత అభ్యర్థులు రెండో విడత గుర్తుల కేటాయింపుతో ప్రచారం షురూ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు..
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారంతో మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి విడత ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 11న పోలింగ్ ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం(డిసెంబర్ 5న) ముగిసింది. గుర్తులు కూడా కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. మూడో విడత ఉపసంహరణ గడువు ఈనెల 9న ముగియనుంది.
మొదటి విడత బరిలో 454 మంది..
మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగే చోట్ల అభ్యర్థుల సంఖ్య తేలింది. మొదటి విడతగా దస్తురా బాద్, కడెం, పెంబి, లక్ష్మణచాంద, మామడ మండలాల్లోని 136 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానా లకు 813, 1072 వార్డుస్థానాలకు 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3న ఉపసంహరణ గడువు ముగియగా ఏకగ్రీవాలు మినహా 119 సర్పంచ్ స్థానాల్లో 454 మంది బరిలో మిగిలారు. 107 వార్డులకు ఏడు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 191 ఏకగ్రీవమయ్యాయి. 1,415 వార్డులకు 1,370 మంది పోటీలో ఉన్నారు.
రెండో విడతలో షురూ..
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్మల్ రూరల్, సోన్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్ జి, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో ఈనెల 14న జరగనుంది. ఆయా మండలాల్లోని 131 సర్పంచ్ స్థానాలకు 730 మంది, 1179 వార్డులకు 2,280 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 6న ఉపసంహరణ గడువు ముగియగా ఏకగ్రీవాలు మినహా 121 సర్పంచ్ స్థానాల్లో 414 మంది బరిలో మిగిలారు. ఇక 1,170 వార్డులకు ఐదు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 115 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోగా 735 వార్డుల్లో 1,706 మంది పోటీలో ఉన్నారు. బరిలో ఉన్నవారికి గుర్తులు కేటాయించారు. దీంతో అదేరోజు రాత్రి నుంచి అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల్లో పార్టీ నేతల సూచనలతో వ్యూహాలకు పదును పెడుతూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.
9న మూడో విడత ఉప సంహరణ..
ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. 133 సర్పంచ్ స్థానాలకు 714, 1126 వార్డుసభ్యుల స్థానాలకు 2,269 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం పరిశీలన పూర్తయింది. ఆదివారం అభ్యంతరాలు స్వీకరించారు. సోమవారం అభ్యంతరాలు పరిశీలిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణకు అవకాశం ఉంది. తర్వాత బరిలో ఉన్నవారికి గుర్తులు కేటాయిస్తారు. దీంతో మూడో విడత నామినేషన్లు వేసినవారు పోటీలో ఉన్నవారిని తప్పించేందుకు బేరసారాలు సాగిస్తున్నారు.
దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు..
పల్లెల నుంచి పట్టణాలకు వలసవెళ్లిన వారు, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సర్పంచ్ అభ్యర్థులు ఫోన్లు చేసి పోలింగ్‌కు రావాలని కోరుతున్నారు. ఇందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు వేసేందుకు వస్తే ఓటుకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వడమే కాకుండా రవాణా ఖర్చులు భరిస్తామని చెబుతున్నారు. జిల్లా నుంచి సుమారు 5 వేలకుపైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. 10 మంది ఓటర్లు ఒకే ప్రాంతంలో ఉంటే ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.


