కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌టౌన్: వరి, పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తుఫాను తీవ్రత దష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీవ్రత తగ్గేవరకు హార్వెస్టింగ్ నిలిపివేయాలన్నారు. కోసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం తహసీల్దార్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, అధికారులు విజయలక్ష్మి, రాజేందర్, సుధాకర్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.


