‘మోంథా’ గుబులు
నిర్మల్: మోంథా తుపాన్ జిల్లానూ టెన్షన్ పెడుతోంది. భారీవర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లే బుధవారం ఉదయం నుంచి వాతావరణం మబ్బుపట్టి వాన మొదలైంది. దీంతో చేతికొచ్చిన పంటలపై ప్రభావం పడనుంద ని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురు, శుక్రవారాల్లో అధికసంఖ్యలో వివాహాలు, శుభకార్యాలుండగా ముహూర్తాలు నిశ్చయించుకున్నవారిలో ఆందోళన మొదలైంది. క్యాచ్‌మెంట్ ఏరియాలో భా రీ వర్ష సూచన ఉండటంతో ఇప్పటికే కడెం ప్రాజెక్ట్ అధికారులు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని వతులు తున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లనూ ఎత్తడంతో గోదావరికి వరద పెరుగుతోంది.
దిగులు చెందుతున్న రైతాంగం
ఆకాశం మబ్బుపట్టి ఉండటంతో రైతన్న గుబులు చెందుతున్నాడు. వరి ధాన్యం, సోయా, పత్తి తదితర పంటలన్నీ చేతికి వచ్చి విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో మోంథా తుపాన్ ఎ లాంటి ప్రభావం చూపుతుందోనని కలవర పడుతున్నారు. వాతావరణ శాఖతోపాటు పలు నివేదికలూ జిల్లాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలున్నట్లు సూచిస్తున్నాయి. ఈక్రమంలో చేతికొచ్చిన పంట ఎక్కడ నీటిపాలవుతుందోనని రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకువెళ్లిన వరి ధాన్యం, సోయాను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
శుభకార్యాలు ఎలా..
జిల్లాలో గురు, శుక్రవారాల్లో భారీగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలున్నాయి. జిల్లావ్యాప్తంగా వివాహాల సీజన్ కొనసాగుతోంది. ప్రతీ ఫంక్షన్‌హాల్‌లో ఏదో ఒక శుభకార్యం ఉండటం గమనార్హం. ఇప్పటికే పెళ్లిళ్లు, ఆయా ఫంక్షన్‌లకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా రు. తీరా.. తీరాన్ని దాటిన మోంథా తుపాన్ వారిని కలవరపెడుతోంది. అన్నీ పూర్తిచేసి పెట్టుకున్న త ర్వాత భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ స మాచారంతో శుభకార్యాలకు ఎలా ఇబ్బంది కలి గిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు..
జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ బుధవారం రాత్రి నుంచి గురువా రం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అ వకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈమేరకు ఎగువన కూడా భారీ వర్షాలు కురిస్తే.. అదేస్థాయిలో వరద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తగా జిల్లాలోని ప్రాజెక్టుల అ ధికారులు పరీవాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరి కలు జారీ చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. కడెం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తిన అధికా రులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
దస్తురాబాద్ మండలంలో..
దస్తురాబాద్: మండల వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. బుధవారం రోజంతా మబ్బులు కమ్ముకున్నాయి. రాత్రి వేళ వర్షం ప్రారంభమైంది. కడెం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేసే అవకాశమున్నట్లు తహసీల్దార్ విశ్వంభర్ తెలిపారు. పశువుల కాపరులు, మత్స్యకారులు గోదావరి పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుకొంటున్న రైతులు


