బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
లక్ష్మణచాంద: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి రాధిక పేర్కొన్నారు. మండలంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పొట్టపల్లి(కె) గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామస్తులకు బాల్య వివాహాల నిరోధక చట్టం, వివిధ రకాల రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించారు. రైతులు రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అలాగే భూసమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజలింగం, లింగాగౌడ్, సిరాజ్, ఎంపీడీవో రాధ, ఎంపీవో నసీరుద్దీన్, ఎస్‌వో నవిత, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


