దుబాయిలో తప్పిపోయిన జిల్లావాసి
సారంగపూర్: మండలంలోని గోపాల్‌పేట్ గ్రామానికి చెందిన పూర్ణ సాయేందర్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి అక్కడ తప్పిపోయాడు. ఈమేరకు ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈవిషయమై ఆయన కుటుంబీకులను సంప్రదించగా సాయేందర్ పదేళ్లుగా దుబాయికి వెళ్లొస్తున్నాడని తెలిపారు. రెండు నెలల క్రితం తన కూతురు వివాహం జరిపించి దుబాయికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో దుబాయిలోని వెస్ట్‌జోన్ కంపెనీలో వీసా రావడంతో 20 రోజుల క్రితం దుబాయికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయనకు కంపెనీ అడ్రస్ దొరకకపోవడంతో అక్కడే తిరుగుతూ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లావాసుల కంటపడ్డాడు. వారు ఆయనను విచారించగా తనది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, గోపాల్‌పేట్ గ్రామం అని తెలిపాడు. ఆయన అనారోగ్యంతో ఉండడం గమనించి ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వివరాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అనంతరం అల్కోస్ ఏరియాలో ఉన్న స్థానికులకు సమాచారం ఇచ్చి సాయేందర్ వద్దకు వెళ్లాలని కోరారు.


