● ఆర్‌ఎస్‌యూ నుంచి సికాస కార్యదర్శిగా ● కోల్‌బెల్ట్ ను
అజ్ఞాతం వీడిన బండి దాదా
మందమర్రిరూరల్: మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(సికాస) కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు. కోల్‌బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ఎదిగిన నేత అనారోగ్యంతో లొంగుబాట పట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మొదటిజోన్‌కు చెందిన అప్పటి సింగరేణి ఉద్యోగి రామారావు, అమృతమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ప్రకాశ్ రెండో సంతానం. స్థానిక కార్మెల్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంటి సమీపంలోని కటికె దుకాణాల ఏరియా అంటే అప్పట్లో నక్సలైట్లకు అడ్డాగా ఉండేది. నక్సలైట్ల అనుబంధ విద్యార్థి సంఘం ఆర్‌ఎస్‌యూ(రాడికల్ విద్యార్థి సంఘం), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్) పోటాపోటీగా కార్యకలాపాలు సాగించేవి. గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమానికి ఆకర్శితుడైన ప్రకాశ్ ఆర్‌ఎస్‌యూతోపాటు అప్పటి ఎనిమిది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కేకే–2 గనిలో చేస్తున్న సమ్మెలో సికాస నాయకులతో చురుగ్గా పాల్గొన్నాడు. 1984లో అప్పటి ఏఐటీయూసీ నేత అబ్రహం హత్య కేసులో శిక్ష పడగా ఆదిలాబాద్ సబ్ జైల్‌కు వెళ్లాడు. ఇతర కేసుల్లో ఉన్న అప్పటి పీపుల్స్‌వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో అజ్ఞాతంలో ఉంటూ హేమను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 1992లో హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. 2004 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు విడుదలయ్యాడు. వరంగల్ జైలులో ఉండగా పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పడడంతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతిచర్చల్లో పాల్గొన్నాడు. చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కోల్‌బెల్ట్ నుంచి దండకారణ్యం నేతగా ఎదిగాడు.
అనారోగ్యం..
ప్రకాశ్‌కు వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, దేశవ్యాప్తంగా పలు ఎన్‌కౌంటర్లు, వరుస లొంగుబాట్లు కుంగదీశాయి. దీంతో రెండు మూడు నెలల క్రితమే లొంగుబాటు ప్రక్రియ ప్రారంభించాడు. మావోయిస్టు అగ్రనేతలతో చర్చించి కేంద్ర కమిటీ సభ్యుడిగా వచ్చే అవకాశాన్ని వదులుకుని తన ఆయుధాన్ని పార్టీకి అప్పగించి 20రోజుల క్రితమే లొంగుబాటు కోసం పోలీసుల ఆదీనంలోకి వచ్చినట్లు సమాచారం. డీజీపీ సమక్షంలో లొంగిపోవడంతో ఆయన పేరిట ఉన్న రివార్డు రూ.25 లక్షలు అందజేశారు.
కుటుంబ సభ్యుల ఆనందం
బండి ప్రకాశ్ లొంగిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. అనేకసార్లు ఎన్‌కౌంటర్లలో మృతిచెందా డని వార్త వినాల్సి వచ్చింది. అజ్ఞాతం వీడి లొంగి పోయి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


