
30 ఏళ్లలోపు పెట్టుబడిదారులు 39%
40 ఏళ్లలోపు వారు ఏకంగా 70 %
ఇన్వెస్టర్లలో నాలుగింట ఒకవంతు మహిళలు
మదుపర్లలో తెలుగు రాష్ట్రాల వాటా 7 %
ఒకప్పుడు.. ‘స్టాక్ మార్కెట్‌తో మాకేంటి సంబంధం?’ అని సామాన్యుడు అనుకునేవాడు. కానీ, ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్టెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్లలోపు వారు 39 శాతం కాగా.. మహిళలు సుమారు 25 శాతం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ మదుపరులు.. ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది.
బిహార్.. దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్‌ఎస్‌ఈ) వేదికగా బిహార్ ఇన్వెస్టర్ల సంఖ్య అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా 678 శాతం పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుంచి 52 లక్షలకు దూసుకెళ్లింది. బిహార్‌లోనే ఇలా ఉంటే మరి ఇతర రాష్ట్రాల్లో? అవును.. ఇతర రాష్ట్రాల్లోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్‌ఈలో మదుపరుల సంఖ్య 2014–15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే పదేళ్లలో 540 శాతం పెరుగుదల! 5–6 నెలలకే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
సులభమైన షేర్ల లావాదేవీలు!
స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి.. ప్రతిరోజూ వేలూ, లక్షల రూపాయలను రకరకాల మార్గాల్లో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క.. దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో, సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది.
ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు! షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా.. అంటే రూ.100 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు.. ఉపసంహరణ సైతం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్‌ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలామందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి.

పెరిగిన మహిళా శక్తి!..: స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022–23లో 22.5 శాతం కాగా ఈ ఏడాది మే నాటికి 24.4 శాతానికి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4 శాతం ఉంటే , గుజరాత్‌లో 27.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 23.4, తెలంగాణలో 24.9 శాతం మహిళలు ఉన్నారు.
ఆ మూడు రాష్ట్రాలు..: ఒక కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్‌లో చేరిన మూడో రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాది 2.4 కోట్లు, తూర్పు భారత్‌లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్‌లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్–10 జిల్లాల్లో రంగారెడ్డి (8), హైదరాబాద్ (10) చోటు దక్కించుకున్నాయి.
దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకుపైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకుపైగా ఉంటే, తెలంగాణలో 51.50 లక్షలకుపైగా ఉన్నాయి.