ప్రచార రంగ దిగ్గజం పీయూష్ పాండే(70) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన పాండే ‘ఫెవికాల్, క్యాడ్‌బెరీ, ఆసియన్ పెయింట్స్..’ ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండ్‌లకు, పలు ప్రభుత్వ కార్యక్రమాల క్యాంపెయిన్లకు ప్రచార స్లోగన్స్ రూపొందించారీయన.
భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా పీయూష్ పాండేకి గుర్తింపు ఉంది. పీయూష్ 1955లో జైపూర్(రాజస్థాన్)లో జన్మించారు. ఆ కుటుంబంలో తొమ్మిది మంది సంతానం. ఆయన సోదరుడు ప్రసూన్ పాండే ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్. సోదరి ఇలా అరుణ గాయని-నటి. క్రికెట్‌లో రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించిన పీయూష్ పాండే.. కన్‌స్ట్రక్షన్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి అడ్వర్‌టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.
1982లో ఒగిల్వీ ఇండియా Ogilvy Indiaలో చేరి.. మొదట క్లయింట్ సర్వీసింగ్ విభాగంలో పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ విభాగంలోకి మారిపోయి.. అంచెలంచెలుగా ఎదిగి కీలక పదవులను చేపట్టారు. ఆయన సారథ్యంలో.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే బావోద్వేగాలకు ముడిపెట్టి ఎన్నో ప్రకటనలు రూపొందించారు. పాక్-భారత్ బార్డర్ బ్యాక్‌డ్రాప్‌తో ఫెవికిక్ ‘తోడో నహీ జోడో’ యాడ్, క్యాడ్‌బెరీ డెయిలీ మిల్క్ “कुछ खास है” యాడ్, వోడాఫోన్ హచ్ డాగ్ వినూత్న ప్రచారాలు ఆకట్టుకున్నాయి.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి కోసం అబ్‌కీ బార్ మోదీ సర్కార్ అనే ప్రచార స్లోగన్‌ను రూపొందించింది ఈయనే కావడం గమనార్హం. అంతేకాదు.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ‘పల్స్‌పోలియో’ యాడ్‌ను స్వయంగా తీర్చిద్దిద్దారు. అడ్వైర్టైజింగ్ రంగంలో ఈయన అందించిన సేవలకుగానూ 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2024లో ఎల్‌ఐఏ లెజెండ్ అవార్డు ఆయన్ని వరించింది.
పీయూష్ పాండే మృతిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ‘‘పీయూష్ పాండే భారతీయ ప్రకటనల రంగాన్ని కొత్త దిశలో నడిపించిన సృజనాత్మక మేధావి. ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆయన మృతి భారతీయ క్రియేటివ్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, Ogilvy India టీమ్‌కు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు స్మృతి ఇరానీ, ఆనంద్ మహీంద్రా, ఉదయ్ కోటక్ లాంటి వ్యాపారవేత్తలూ ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.
Truly at a loss for words to express my sadness at the demise of Padma Shri Piyush Pandey.
A phenomenon in the world of advertising, his creative genius redefined storytelling, giving us unforgettable and timeless narratives.
To me, he was a friend whose brilliance shone… pic.twitter.com/t6ZDSViCrS— Piyush Goyal (@PiyushGoyal) October 24, 2025


