breaking news
Piyush Pandey
-
నవ్విస్తూ కొనేలా చేశాడు!
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్’ ‘యాడ్ గురు’గా విఖ్యాతుడైన పీయుష్ పాండే (70) శుక్రవారం కన్ను మూయడంతో అడ్వర్టయిజింగ్ చరిత్రలో ఒక మహోధ్యాయం ముగిసింది. ఏదైనా వస్తువును దాని ఘనతతో కంటే ‘ఆత్మ’తో కొనిపించాలని నమ్మే పీయుష్ భారతీయులు ఇష్టపడే హాస్యాన్ని మేళవించి క్యాంపయిన్స్ నిర్వహించి ప్రొడక్ట్స్‌ను సూపర్‌హిట్ చేయడంలో దిట్ట.ఫెవికాల్. కాడ్బరీస్, ఏసియన్ పెయింట్స్... ఎన్నో. ఆయనకు నివాళి.మీకు ఈ యాడ్ గుర్తుండి ఉంటుంది. ఒక పెద్దమనిషి చెరువు గట్టున కూచుని గంటల తరబడి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కాని ఒక్క చేపా పడదు. అప్పుడు ఒక తమిళ వ్యక్తి హడావిడిగా వచ్చి ఒక చిన్న కర్రకు జిగురు అంటించి నీళ్లలో పెడతాడు. అంతే. చేపలు అంటుకుపోతాయి. పెద్దమనిషి నోరెళ్లబెడుతుండగా ఆ తమిళవ్యక్తి హుషారుగా చేపలతో చిత్తగిస్తాడు. కారణం? అతడు వాడింది ‘ఫెవిక్విక్’. ఈ యాడ్ వచ్చాక ఫెవిక్విక్ అమ్మకాలు అమాంతం పెరిగాయి. దానిని తయారు చేసినవాడు పీయుష్ పాండే. ఓగిల్వి ఇండియా యాడ్ ఏజెన్సీక్రియేటివ్ చైర్మన్, సి.ఇ.ఓ.‘నువ్వు ఏ యాడ్ అయినా తయారు చెయ్. అది ముందుగా జనానికి నచ్చాలి’ అంటాడు పీయుష్.పీయుష్ పాండేది జైపూర్. అతని కుటుంబం ఢిల్లీలో స్థిరపడగా అక్కడే చదువుకున్నాడు. క్రికెటర్ కావాలని ఉండేది. రంజీ స్థాయిలో పెద్ద ఆటగాడిగా ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఆడేవాడు. కాని ఆట కంటే కూడా ఇంట్లో వాతావరణమే అతణ్ణి ఎక్కువగా తీర్చిదిద్దింది. ‘మా ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, సంగీతం, కళల గురించి చర్చ ఉండేది’ అంటాడు పీయుష్. సుప్రసిద్ధ గాయని ఇలా అరుణ్ అతడి పెద్దక్క. దాంతో అతను తెలియకనే అడ్వర్టయిజింగ్లోకి వచ్చాడు. 1982లో ముంబైలోని ఓగిల్విలో ‘క్లయింట్ సర్వీసింగ్ ఎగ్జిక్యూటివ్’గా చేరిన పీయుష్ ‘సన్‌లైట్’డిటెర్జెంట్కు మొదటి ప్రకటన తయారు చేయడంతో సంస్థ దృష్టిలో పడ్డాడు. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ సంస్థకు బిగ్‌బాస్‌గా మారి భారతదేశంలో నం.1 యాడ్ ఏజెన్సీగా విస్తరింపచేశాడు. ప్రపంచ వ్యాప్త శాఖలు ఉన్న ఈ ఏజెన్సీకి అన్నింటికన్నా లాభదాయమైన శాఖగా ఇండియా శాఖను నిలబెట్టాడు పీయుష్. నవ్విస్తూ కొనిపించడం, సున్నితమైన భావోద్వేగాలతో ప్రొడక్ట్‌ను మనసులో నాటుకునేలా చేయడం పీయుష్ ప్రత్యేకత. ‘హమారా బజాజ్’ యాడ్ అందుకు ఉదాహరణ. ఆ యాడ్‌లో భారతీయులకు ఒక స్కూటర్‌తో ఎలాంటి అనుబంధం ఉంటుందో చూపడం ద్వారా పెద్ద అమ్మకాలు సాధించాడు. స్కూటర్ కొనేవారు అదే కొనాలని, స్కూటర్ కొనలేని వారు కనీసం కలల్లో నిలుపుకోవాలని ఆ యాడ్ ద్వారా అతడు నిరూపించాడు. ఇక క్రికెట్ మైదానంలో వింత స్టెప్స్ వేస్తూ చొచ్చుకుని వచ్చే కాడ్బరీ అమ్మాయిని కనిపెట్టింది పీయుషే. కాడ్బరీ యాడ్‌లో చాక్లెట్‌ను, ఆ అమ్మాయిని ఎవరూ మర్చికోలేకపోయారు. ఒక విధంగా అమ్మాయిల ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో పీయుష్ చూపించాడు. ఆ తర్వాత పీయుష్ చేసిన ‘ఫెవికాల్’ క్యాంపెయిన్ అందరినీ నవ్వుల పూవులు పూయిస్తూ ఫెవికాల్ అభిమానులుగా మార్చింది. ‘ఈ బంధం దృఢమైనది’ అనడంలో ‘బంధం’ అనే మాటను జాగ్రత్తగా ఎంచింది. ఫెవికాల్ యాడ్‌లో ఒక తల్లి పని చేసుకుంటూ మాటిమాటికి అటూ ఇటూ తిరుగుతున్న పసిపిల్లాణ్ణి ఒక ఖాళీ డబ్బా మీద కూచోబెడుతుంది. అక్కడ నుంచి ఇక ఆ పిల్లాడు కదలడు. కారణం? అది ఫెవికాల్ ఖాళీ డబ్బా.అలాగే ‘ఎంసీల్’ యాడ్స్ కూడా జనానికి తెగ నచ్చాయి. ఇక ‘పగ్’ డాగ్‌ను ‘హచ్’ డాగ్‌గా మార్చిన బ్రహ్మ పీయుష్. ‘వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్’ అంటూ ఒక పసిపిల్లాడి వెంట కుక్కపిల్ల వెళుతున్న హచ్ నెట్వర్క్ యాడ్‌కు కోట్ల మంది అభిమానులున్నారు. ఇక వొడాఫోన్ ‘జూజూస్’ ఎంత వింత గొలిపి కుతూహలం రేడియో అందరికీ తెలుసు. ప్రకటనలు వ్యాపారానికే కాదు దేశహితవుకు కూడా ఉపయోగపడాలని నమ్మిన పీయుష్... అమితాబ్‌తో కలిసి చేసిన ΄ోలియో కాంపెయిన్ చరిత్రాత్మకమైనది. ‘దో బూంద్ జిందగీకె’ పేరుతో రెండు పోలియో చుక్కలు పిల్లలకు ఎంత జీవధాతువులో పల్లెపల్లెకూ చేరేలా ప్రచారం చేయగలిగాడు.పీయుష్ పేరు దేశ అడ్వర్టయిజింగ్ రంగంలో చిరకాలం నిలిచిపోతుంది. (చదవండి: Diwali 2025: ఆ గ్రామంలో దీపావళి ప్రాభవమే వేరు! ) -
అడ్వర్టయిజింగ్ దిగ్గజం.. పీయూష్ పాండే కన్నుమూత
ముంబై: భారత అడ్వర్టయిజింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించి, ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పీయూష్ పాండే (70) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారని పీయూష్ సోదరి ఇలా అరుణ్ వెల్లడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని ‘అబ్ కీ బార్, మోదీ సర్కార్’ అనే స్లోగన్‌తో దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసిన ఘనత పీయూష్ పాండే సొంతం. 1982లో ఓగిల్వీ ఇండియాలో చేరిన పాండే.. తదనంతరం ఆ సంస్థ గ్లోబల్ క్రియేటివ్ చీఫ్ స్థాయికి ఎదిగారు. స్థానిక భాషలు, హాస్యం, భావోద్వేగాలను సమ్మిళితం చేస్తూ భారత అడ్వర్టయిజింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశారు. క్యాడ్బరీ ‘కుచ్ ఖాస్ హై’, మొదలుకొని ఏషియన్ పెయింట్స్ ‘హర్ ఖుషీ మే రంగ్ లాయే’ వంటి ఎన్నో యాడ్లతో పాండే పేరు మార్మోగింది. ఫెవికాల్ యాడ్స్ (ముఖ్యంగా ‘ఎగ్’ యాడ్) అయితే దేశవ్యాప్తంగా అందరికీ చిరపరిచితమే. ప్రకటనల రంగంలో తన విశేష ప్రతిభ, కృషిని గుర్తిస్తూ 2016లో భారత ప్రభుత్వం పీయూష్‌ను పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది. 2024లో లండన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లెజెండ్ పురస్కారం కూడా దక్కింది. అంతేకాదు, 2004లో కేన్స్ లయన్స్ జ్యూరీకి ప్రాతినిధ్యం వహించిన తొలి ఆసియా వ్యక్తిగా కూడా ఆయన ఖ్యాతి దక్కించుకున్నారు. ‘మిలే సుర్ మేరా తుమారా’ అంటూ దేశ సాంస్కృతిక వారసత్వ సంపదకు పాట రూపాన్నిచి్చ, దేశమంతా ప్రజలను మైమరపించిన ఘనత కూడా పీయూష్ పాండే సొంతం. రంజీ ట్రోఫీలో రాజస్థాన్ క్రికెట్ జట్టు తరఫున కూడా ఆడటం పలు రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనం. దేశవ్యాప్తంగా నివాళి... పీయూష్ పాండే ప్రతిభాపాటవాలు, పలు రంగాలో ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. ‘అడ్వర్టయిజింగ్, కమ్యూనికేషన్స్ రంగంలో పీయూష్ పాండే అద్భుతమైన కృషి చేశారు. గత కొన్నేళ్లుగా మా మధ్య జరిగిన సంభాషణలను పదిలంగా గుర్తుంచుకుంటాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’ పోస్ట్‌లో సంతాపం తెలియజేశారు. కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, పీయూష్ గోయల్‌తో పాటు కార్పొరేట్ రంగ ప్రముఖులంతా ఘన నివాళి అరి్పంచారు. ‘భారత విజయ గాథను ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. మన అడ్వర్టయిజింగ్ పరిశ్రమలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు, స్వదేశీ స్ఫూర్తిని రగిలించారు’ అని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) మరణంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ తన ట్వీట్లో..‘ దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి. అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు’అని పేర్కొన్నారు. కాగా, ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించిన ఈ సృజనాత్మక మేధావి, భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. Deeply saddened by the loss of Padma Shri Piyush Pandey Ji, an advertising legend who connected India with his creative storytelling. My sincere condolences to his family and friends. The work he has done for the launch of Sakshi and Bharathi Cements are well cherished. pic.twitter.com/BPf5KZmbeS— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025 -
అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ కన్నుమూత
ప్రచార రంగ దిగ్గజం పీయూష్ పాండే(70) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన పాండే ‘ఫెవికాల్, క్యాడ్బెరీ, ఆసియన్ పెయింట్స్..’ ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు, పలు ప్రభుత్వ కార్యక్రమాల క్యాంపెయిన్లకు ప్రచార స్లోగన్స్ రూపొందించారీయన. భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా పీయూష్ పాండేకి గుర్తింపు ఉంది. పీయూష్ 1955లో జైపూర్(రాజస్థాన్)లో జన్మించారు. ఆ కుటుంబంలో తొమ్మిది మంది సంతానం. ఆయన సోదరుడు ప్రసూన్ పాండే ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్. సోదరి ఇలా అరుణ గాయని-నటి. క్రికెట్లో రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించిన పీయూష్ పాండే.. కన్స్ట్రక్షన్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 1982లో ఒగిల్వీ ఇండియా Ogilvy Indiaలో చేరి.. మొదట క్లయింట్ సర్వీసింగ్ విభాగంలో పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ విభాగంలోకి మారిపోయి.. అంచెలంచెలుగా ఎదిగి కీలక పదవులను చేపట్టారు. ఆయన సారథ్యంలో.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే బావోద్వేగాలకు ముడిపెట్టి ఎన్నో ప్రకటనలు రూపొందించారు. పాక్-భారత్ బార్డర్ బ్యాక్‌డ్రాప్‌తో ఫెవికిక్ ‘తోడో నహీ జోడో’ యాడ్, క్యాడ్బెరీ డెయిలీ మిల్క్ “कुछ खास है” యాడ్, వోడాఫోన్ హచ్ డాగ్ వినూత్న ప్రచారాలు ఆకట్టుకున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి కోసం అబ్కీ బార్ మోదీ సర్కార్ అనే ప్రచార స్లోగన్‌ను రూపొందించింది ఈయనే కావడం గమనార్హం. అంతేకాదు.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ‘పల్స్‌పోలియో’ యాడ్‌ను స్వయంగా తీర్చిద్దిద్దారు. అడ్వైర్టైజింగ్ రంగంలో ఈయన అందించిన సేవలకుగానూ 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2024లో ఎల్ఐఏ లెజెండ్ అవార్డు ఆయన్ని వరించింది.పీయూష్ పాండే మృతిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ‘‘పీయూష్ పాండే భారతీయ ప్రకటనల రంగాన్ని కొత్త దిశలో నడిపించిన సృజనాత్మక మేధావి. ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆయన మృతి భారతీయ క్రియేటివ్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, Ogilvy India టీమ్‌కు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు స్మృతి ఇరానీ, ఆనంద్ మహీంద్రా, ఉదయ్ కోటక్ లాంటి వ్యాపారవేత్తలూ ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.వైఎస్ జగన్ దిగ్ర్భాంతివైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి.అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు. Truly at a loss for words to express my sadness at the demise of Padma Shri Piyush Pandey.A phenomenon in the world of advertising, his creative genius redefined storytelling, giving us unforgettable and timeless narratives.To me, he was a friend whose brilliance shone… pic.twitter.com/t6ZDSViCrS— Piyush Goyal (@PiyushGoyal) October 24, 2025 -
బీజేపీ ప్రచారానికి రూ.400 కోట్లా?
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయనున్నట్టు చెబుతున్న 400 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) నేత అశతోష్ ప్రశ్నించారు. ఇది నల్లధనమా లేక బీజేపీ ఏదైనా వ్యాపారం చేసి సంపాదించిందా అని అడిగారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి అంబానీ లేదా అదానీ నిధులిచ్చారా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను తలెకెత్తుకోవద్దని పియూష్ పాండే, ప్రసూన్ జోషిలకు అశతోష్ విజ్ఞప్తి చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి రూ.400 కోట్లు ఖర్చు చేయనుందని వార్తలు వచ్చాయి. ప్రచార బాధ్యతను ప్రకటనల రంగంలో ప్రముఖులైన పాండే, జోషిలకు అప్పగించినట్టు సమాచారం.


