ముంబై: భారత అడ్వర్టయిజింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించి, ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పీయూష్ పాండే (70) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారని పీయూష్ సోదరి ఇలా అరుణ్ వెల్లడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని ‘అబ్ కీ బార్, మోదీ సర్కార్’ అనే స్లోగన్‌తో దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసిన ఘనత పీయూష్ పాండే సొంతం. 1982లో ఓగిల్వీ ఇండియాలో చేరిన పాండే.. తదనంతరం ఆ సంస్థ గ్లోబల్ క్రియేటివ్ చీఫ్ స్థాయికి ఎదిగారు.
స్థానిక భాషలు, హాస్యం, భావోద్వేగాలను సమ్మిళితం చేస్తూ భారత అడ్వర్టయిజింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశారు. క్యాడ్‌బరీ ‘కుచ్ ఖాస్ హై’, మొదలుకొని ఏషియన్ పెయింట్స్ ‘హర్ ఖుషీ మే రంగ్ లాయే’ వంటి ఎన్నో యాడ్‌లతో పాండే పేరు మార్మోగింది. ఫెవికాల్ యాడ్స్ (ముఖ్యంగా ‘ఎగ్’ యాడ్) అయితే దేశవ్యాప్తంగా అందరికీ చిరపరిచితమే. ప్రకటనల రంగంలో తన విశేష ప్రతిభ, కృషిని గుర్తిస్తూ 2016లో భారత ప్రభుత్వం పీయూష్‌ను పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది.
2024లో లండన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లెజెండ్ పురస్కారం కూడా దక్కింది. అంతేకాదు, 2004లో కేన్స్ లయన్స్ జ్యూరీకి ప్రాతినిధ్యం వహించిన తొలి ఆసియా వ్యక్తిగా కూడా ఆయన ఖ్యాతి దక్కించుకున్నారు. ‘మిలే సుర్ మేరా తుమారా’ అంటూ దేశ సాంస్కృతిక వారసత్వ సంపదకు పాట రూపాన్నిచి్చ, దేశమంతా ప్రజలను మైమరపించిన ఘనత కూడా పీయూష్ పాండే సొంతం. రంజీ ట్రోఫీలో రాజస్థాన్ క్రికెట్ జట్టు తరఫున కూడా ఆడటం పలు రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనం.
దేశవ్యాప్తంగా నివాళి...
పీయూష్ పాండే ప్రతిభాపాటవాలు, పలు రంగాలో ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. ‘అడ్వర్టయిజింగ్, కమ్యూనికేషన్స్ రంగంలో పీయూష్ పాండే అద్భుతమైన కృషి చేశారు. గత కొన్నేళ్లుగా మా మధ్య జరిగిన సంభాషణలను పదిలంగా గుర్తుంచుకుంటాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’ పోస్ట్‌లో సంతాపం తెలియజేశారు. కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, పీయూష్ గోయల్‌తో పాటు కార్పొరేట్ రంగ ప్రముఖులంతా ఘన నివాళి అరి్పంచారు.
‘భారత విజయ గాథను ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. మన అడ్వర్టయిజింగ్ పరిశ్రమలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు, స్వదేశీ స్ఫూర్తిని రగిలించారు’ అని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పేర్కొన్నారు.


