ఆర్థిక భద్రతకు ప్రతీకగా పరిగణించే బంగారం ఇటీవల ధరల పెరుగుదలతో భారత మార్కెట్లో మళ్లీ ప్రధాన చర్చానీయాంశంగా మారింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో ఇప్పటికే బంగారం ధర 10 గ్రాములకు రూ.1.2 లక్షల మార్కును దాటింది.
ఇప్పుడు అందరి దృష్టి వచ్చే 2026 సంవత్సరంలో బంగారం ధర ఎలా ఉంటుందా అన్నదాని వైపు మళ్లింది. 2026లో “ఆర్థిక అల్లకల్లోలం” రాబోతుందని ప్రపంచ ప్రసిద్ధ బల్గేరియన్ జ్యోతిషురాలు బాబా వంగా గతంలో చెప్పిన జోస్యం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
ప్రపంచ పరిస్థితుల ప్రభావం
నిపుణుల ప్రకారం, బంగారం పెరుగుదల వెనుక ప్రధాన కారణాలు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణ భయాలు, కరెన్సీ అస్థిరత, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం. ఈ అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు నెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
2026 అంచనాలు
చరిత్రాత్మకంగా సంక్షోభ సమయాల్లో బంగారం ధరలు 20–50 శాతం వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ ఆర్థిక అస్థిరత కొనసాగితే, బంగారం ధరలు 25–40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీపావళి (అక్టోబర్–నవంబర్) 2026 నాటికి భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షల నుంచి రూ.1.82 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.


